టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అవకాశం దొరికితే ఇప్పటికీ ప్రేమ కథలు, హీరోయిన్లతో ముచ్చట్లకు రెడీ అవుతున్నారు. ఏ మాటకామాట మన ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. రూ. కోట్లలో వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇతర భాష సినిమా పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ స్టార్ హీరో రొమాంటిక్ రోల్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనే మలయాళ సినిమా సీనియర్ స్టార్ మమ్ముట్టి.
అనారోగ్యం కారణంగా కొన్ని నెలలు విరామం తీసుకున్న మమ్ముట్టి రీసెంట్‌గా మళ్లీ యాక్టింగ్‌తో తిరిగి బిజీ అయ్యారు. రాబోయే సినిమా ‘కలాంకావల్’ ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా చాలా సినిమాలు చేసిన మమ్ముట్టిని ఇప్పుడు రొమాంటిక్ కథల గురించి అడిగితే.. నేను రొమాంటిక్ పాత్రలు కావాలని అడిగితే.. దానికి తగిన కథలనే దర్శకనిర్మాతలు సిద్ధం చేస్తారు అని కామన్ స్టార్ హీరోలానే చెప్పారు.
అయితే ఇప్పుడు అలాంటి పాత్రలు సరదాగా అనిపించవని క్లారిటీ ఇచ్చేశారు. సీనియర్ నటుడిగా మారిన తర్వాత అనుభవం, వయసుకు తగిన పాత్రలనే ఎంచుకోవాలి. ఎక్స్‌పీరియెన్స్ వచ్చాక వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి అవకాశం ఉంటుంది. అలాంటివే చేయాలి కూడా అని చెప్పారు. ఇక విలన్ పాత్రల గురించి చెబుతూ నాగార్జున మాటల్నే చెప్పారు మమ్ముట్టి. హీరో పాత్రకు పరిమితులు ఉంటాయి కానీ విలన్ పాత్రకు ఉండవు. అలాంటి పాత్రల్లో నటించిననప్పుడు మనలోని నటన బయటకు వస్తుంది అని చెప్పారు.
విలన్ పాత్రల్లో నటించడానికి ధైర్యం కావాలని అంటుంటారు. కానీ కొత్తపాత్రల్లో నటించాలనే తపన ఉంటే చాలు. ఒకే తరహా పాత్రలు చేస్తూ చేస్తూ మనలోని నటుడిని మర్చిపోకూడదు అని నేను చెబుతాను. కొత్తదనం ఉన్న పాత్రలు చేస్తేనే నటనకు ప్రాధాన్యమిచ్చినట్లు. అలా చేసే ఈ ఈ స్థాయికి ఎదిగాను అని చెప్పారు. తనను అగ్ర హీరో అని పిలిస్తే ఇబ్బంది లేదు కానీ.. గొప్ప నటుడు అంటే ఇంకా ఆనందిస్తాను చెప్పారు.