ఈ టైటిల్ చూడగానే ‘పెళ్లి చేసుకుందాం రా’ సినిమాలోని బ్రహ్మానందం పాత్ర గుర్తొచ్చింది కదూ. తనకి ఇష్టమొచ్చినపుడు నచ్చిన పండగలను జరుపుకుంటూ కాలనీ వాసులను ఇబ్బంది పెట్టి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం. ఇప్పుడు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఇదే దారిని అనుసరిస్తున్నారు. ఈ దసరా పండగ నాడు ‘మనఊరి రామాయణం’ సినిమాతో శ్రీరామనవమి సంబరాలను తెరపై చూపించనున్నారు.
ప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘మనఊరి రామాయణం’. ప్రియమణి, సత్య, పృథ్వీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో సాగనుందిట. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే ఇది సుస్పష్టమవుతుంది. “మనం నలుగురి ముందు మంచివాడు అనిపించుకోవడానికి రాముడి అవతారం ఎత్తితే, ఒంటరిగా ఉన్నప్పుడు మనలోని రావణుడు బయటకు వస్తాడు. తన బలం తెలుసుకోలేని హనుమంతుడిలాంటోళ్లు ఎంతోమంది. ఇలా రామాయణంలోని పాత్రలు ప్రతి వూర్లోనూ, ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంటాయి. ఆ ఇతివృత్తంతోనే ఈ సినిమా ఉంటుందని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
భాస్కరభట్ల రాసిన గీతం సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమా ఆగస్ట్ 7న విడుదల కానుండగా దర్శకుడిగా తన తర్వాతి సినిమాని ఆరంభించే పనుల్లో పడ్డారు ఈ జాతీయ నటుడు. కన్నడ చిత్రం ‘గూది బణ్ణ సాధారణ మైకట్టు’ సినిమాని తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి టైటిల్ గా “అరవై ఏళ్ళు.. చామన ఛాయ” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే 60 ఏళ్ళ వ్యక్తి కథ ఇది.