మన ఊరి రామాయణం

  • October 7, 2016 / 05:47 AM IST

విలక్షణ నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్… నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా కొత్తగా చూపించాలనే మనస్తత్వం కలవాడు. అలా ఇప్పటికే ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో ‘ధోని’, ‘ఉలవచారు బిర్యానీ’ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన ఊరి రామాయణం’ అనే చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

కథ : దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించి, చివరకు తన ఊరిలో స్థిరపడిన వ్యక్తి భుజంగరావు(ప్రకాశ్ రాజ్). ఎప్పుడు పరువు కోసం ప్రాకులాడుతుంటాడు. భుజంగరావుకి నమ్మకస్తుడు ఆటోడ్రైవర్ శివ(సత్యదేవ్). అనుకోకుండా ఓ రోజు బస్టాండ్ దగ్గర ప్రియమణిని చూసి, ఆమెపై మోజు పడతాడు భుజంగరావు. శివ ఆమెతో మాట్లాడి ఆ రాత్రికి ఒప్పిస్తాడు. భుజంగరావుతో ఆ రాత్రి గడపడానికి ప్రియమణి అంగీకరిస్తుంది. అయితే పరువు కోసం ప్రాకులాడే భుజంగరావు ఆమెతో ఎక్కడ గడపాలో తెలియక తన ఇంటి ముందు ఉన్న ఓ చిన్న రూమ్ లో మకాం వేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా బయట నుంచి తాళం వేసి, ఓ గంట తర్వాత వస్తానని చెప్పి శివ బయటకు వెళతాడు. ఆ తర్వాత శివ డ్రంక్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయి ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? భుజంగరావు ప్రియమణితో ఏం చేశాడు? వీరిద్దరి వ్యవహారం ఊరంతా తెలిసిపోయిందా లేదా? ఆ ఇంట్లో ఇరుక్కుపోయిన సమయంలో భుజంగరావు పరిస్థితి ఏంటి? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథాంశం.

నటీనటుల పనితీరు : ‘మన ఊరి రామాయణం’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ప్రకాష్ రాజ్ నటన. భుజంగరావు పాత్రలో ఒదిగిపోయాడు. ఆ హావభావాలు, నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని కొన్ని సీన్లు అని కాకుండా ప్రకాష్ రాజ్ కనిపించిన సీన్లు అన్ని కూడా హైలెట్ గా చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ ను కొత్తగా డిజైన్ చేసుకున్నాడు. ఆ పాత్రలో అదరగొట్టేసాడు. ఇక ప్రియమణి తన పాత్రలో ఒదిగిపోయింది. ఎలాంటి బెరుకులేని ఓ వేశ్యగా తన హావభావాలతో ఆకట్టుకుంది. భుజంగరావు, వేశ్య పాత్రలలో ప్రకాష్ రాజ్, ప్రియమణిలు తప్ప మరెవరూ చేయలేరు అనిపించే విధంగా ఇద్దరూ వారి వారి నటనతో చింపేసారు. బ్రతికిచెడ్డ దర్శకుడిగా పృద్వీ నటన బాగుంది. మళ్ళీ ఓ సినిమాకు దర్శకత్వం వహించాలనే ప్రయత్నించే పాత్రలో పృద్వీ చాలా చక్కగా నటించాడు. చివరగా భుజంగరావు నమ్మకస్తుడిగా ఆటో డ్రైవర్ శివ పాత్రలో సత్యదేవ్ చక్కగా నటించాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

సాంకేతికవర్గం పనితీరు : ‘మన ఊరి రామాయణం’ సినిమా స్టొరీ లైన్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, దానిని ప్రకాష్ రాజ్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో నడిపించాడు. నిజజీవితానికి అద్దంపట్టే విధంగా సహజంగా చూపించాడు. అధ్బుతమైన స్క్రీన్ ప్లేతో నడిపించడమే కాకుండా నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్న ప్రకాష్ రాజ్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. దర్శకుడిగా ప్రకాష్ రాజ్ మరో మెట్టు ఎదిగాడని చెప్పుకోవచ్చు. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన పాటలు సినిమాకు తగ్గట్లుగా బాగున్నాయి. ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ముఖేష్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా న్యాచురల్ గా కనిపించే విధంగా చూపించాడు. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ : కథలో విషయం ఉండడం ఎంత అవసరమో కథనంలో వేగం ఉండడం కూడా అంతే అవసరం. “మన ఊరి రామాయణం”లో మిస్ అయిన విషయం అదే. ఈ సినిమా సాధారణ ప్రేక్షకుడిని అలరించకపోవచ్చు కానీ.. ఓ మోస్తరుగా ఆకట్టుకోవచ్చు!

రేటింగ్ : 2.5/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus