బాల నటుడిగా మూడు సినిమాల అనుభవం ఉంది. (అయితే ఆ విషయం ఆయన, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేంతవరకు తెలియలేదు అనుకోండి) హీరోగా చేసిన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల వసూళ్లు అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేశాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కామ్ అయిపోయాడు. రీసెంట్ సినిమాలను ఫాలో అయ్యేవారికి ఈ హీరో వైష్ణవ్ తేజ్ అని తెలిసిపోతుంది. అయితే ఎందుకు సినిమాలు చేయడం లేదు అనేది మాత్రం తెలియడం లేదు.
కావాలంటే మీరే చూడండి వైష్ణవ్ నుండి కొత్త సినిమా వచ్చి రెండున్నరేళ్లు అయిపోయింది. ఎప్పుడో 2023 నవంబరులో ‘ఆదికేశవ’ సినిమా చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమా రాకపోవడం పక్కన పెడితే, సినిమాల గురించి పుకార్లు కూడా రావడం లేదు. ఆ సినిమా చేస్తాడు, ఈ సినిమా చేస్తాడు, ఆ కథ విన్నాడు, ఈ కథ ఓకే చేశాడు లాంటి రూమర్లు కూడా ఎక్కడా వినిపించడం లేదు. అలా అని నటనలో, లుక్‌లో ఏమన్నా వీకా అంటే అదీ లేదు.
‘ఉప్పెన’ సినిమాతోనే నటన, లుక్‌లో ఎంత పవర్‌ఫుల్ అనేది తెలిసిపోయింది. అందులో ఆశిగా అన్ని ఎమోషన్స్ బాగా పండించాడు. అందుకే ఆ సినిమాకు అన్ని వసూళ్లు వచ్చాయి. దానికి కృతి శెట్టి మ్యాజిక్ అదనం అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ‘ఉప్పెన’ తర్వాత చేసిన ‘కొండ పొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ దారుణమైన ఫలితాలు చూశాయి. ఏ సినిమా కూడా మినిమమ్ ఫలితాలు రాబట్టలేదు.
అయితే ఇలాంటి పరిస్థితి యువ హీరోకు రావడం పెద్ద విషయం కాదు. టాలీవుడ్‌లో వరుసగా పది ప్లాఫ్ సినిమాలు వచ్చినా సినిమాలు చేసిన, చేస్తున్న హీరోలు ఇంకా ఉన్నారు. అలాంటి మెగా ఫ్యామిలీ బ్యాకప్ ఉన్న వైష్ణవ్‌కు సినిమాలు రావడం లేదు అంటే నమ్మలేం. అయితే ఆయనే సినిమా కథలు వినడమే, ఓకే చేయడమే మానేసి ఉండాలి. లేదంటే ఎవరో అతనికి రాంగ్ గైడెన్స్ ఇస్తుండాలి. చూద్దాం ఇప్పటికైనా ఏదైనా కొత్త సినిమా లీక్ ఇస్తారేమో అతని టీమ్.