మామూలుగా అయితే రోజుకు నాలుగు షోలు.. ప్రత్యేక రోజుల్లో పర్మిషన్లు ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఐదు షోలు.. టాలీవుడ్‌లో చాలా రోజులుగా ఇదే జరుగుతోంది. అయితే విడుదలకు ముందు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరో షో వేస్తుంటారు. అయితే ఇది ఆ ఒక్క రోజుకే పరిమితం అవుతోంది. కానీ గతంలో సినిమా రిలీజ్ అయిన తొలి వారం ఆరు షోలు పడేవి. ఒక్కోసారి ఏడు షోలు కూడా పడేవి. అవెలా అనుకుంటున్నారా? అర్ధరాత్రి 1 గంటలకు, వేకువజామును 4 గంటలకు షో పడేది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? పైన చెప్పిన స్పెషల్ షోల్లో ఒకటి ఇప్పుడు జరుగుతోంది. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వరుస సినిమాలు ఉండటంతో థియేటర్ల సర్దుబాటు జరిగిపోయింది. దీంతో ఇప్పటికిప్పుడు కొత్త థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 1గంట షోలు వేస్తున్నారట. అన్ని అనుమతులు తీసుకొనే అని సమాచారం.
‘రాజాసాబ్’ తప్పించి మిగిలిన నాలుగు సినిమాలకు మోస్తారు నుండి హిట్ టాక్ అందుకున్నాయి. దీంతోనే ఈ ఇబ్బంది వస్తోందని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల జనాలు అంటున్నారు. ఒకట్రెండు సినిమాలు ఆగుంటే బాగుండేది అని వారి ఆలోచన. ఏదైతేముంది టాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలర్ ఫుల్ సంక్రాంతి మళ్లీ వచ్చింది. ఓవైపు చిరంజీవి సినిమాకు అదనపు ప్రత్యేక షోలు.. ఇంకోవైపు ఇతర హీరోల సినిమాలకు థియేటర్ల ఫుల్లు ఇంకేం కావాలి చెప్పండి.
ఇక ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా వసూళ్ల సంగతి చూస్తే.. మూడు రోజులు + ప్రీమియర్లు కలిపి రూ.154 కోట్ల వసూళ్లు అందుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పండగ రోజులు, వీకెండ్ కావడంతో ఈ వారాంతానికి ఈ మొత్తం డబుల్ అవ్వొచ్చు అని టాక్.