మనమంతా

‘ఐతే’,’ప్రయాణం’,’సాహసం’ ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ‘మనమంతా’ అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్ లాల్ మొదటిసారిగా తెలుగులో పూర్తి స్థాయి పాత్ర చేస్తుండడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. గౌతమి కూడా చాలా కాలం తరువాత తెలుగు తెరపై ఈ సినిమా ద్వారా కనిపించనుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయిందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ : సాయిరామ్(మోహన్ లాల్) ఓ సూపర్ మార్కెట్ లో అస్సిస్టెంట్ మ్యానేజర్ గా పని చేస్తుంటాడు. అప్పులు చేసుకుంటూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. తను పని చేసే స్టోర్ లో మ్యానేజర్ పోస్ట్ ఖాళీ అవుతుండడంతో ఆ పోస్ట్ తనకే వస్తుందని భావిస్తాడు సాయిరామ్. కానీ విశ్వనాథ్(హర్షవర్ధన్)అనే మరో వ్యక్తి కూడా ఆ పోస్ట్ కోసం ప్రయత్నిస్తుంటాడు. దీంతో విశ్వనాథ్ ను ఇంటర్వ్యూకు రాకుండా చేయాలని మోహన్ లాల్ ఓ పని చేస్తాడు. ఆ పని వల్ల తనే సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఇది ఇలా ఉండగా గాయత్రి(గౌతమి) అనే మధ్యతరగతి గృహిణి పెద్ద చదువులు చదివినప్పటికీ ఇంటికే పరిమితమయి ఉంటుంది. ఇళ్ళు తప్ప మరో ప్రపంచం తెలియని గాయత్రి కుటుంబం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్ధపడుతుంది. మరో పక్క అభి(విశ్వాంత్) ఇంజనీరింగ్ చదివే విధ్యార్తి. చదువు తప్ప మరొకటి తెలియని అభి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ తను మాత్రం స్నేహమనే అనుకుంటుంది. అలానే మహిత(రైనారావ్) అనే చిన్న పాప చుట్టూ ఉండేవారు సంతోశంగా ఉండాలనుకుంటుంది. ఓ చిన్న బాబుని తన స్కూల్ లో జాయిన్ చేయిస్తుంది. కానీ ఒకరోజు ఆ అబ్బాయి కనపడకుండా పోతాడు. తనను వెతుక్కుంటూ మహిత తిరుగుతుంటుంది. ఇలా నలుగురు వ్యక్తుల మధ్య జరిగే కథే మనమంతా. సాయిరామ్ కు ఎదురైన సమస్య ఏంటి..? గాయత్రి విదేశాలకు వెళ్లిపోయిందా..?అమ్మాయి ప్రేమను పొందలేని అభి ఏం చేశాడు..? మహిత వెతుకుతున్న అబ్బాయి దొరికాడా..? అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్ : సాయిరామ్ పాత్రలో మోహన్ లాల్ అధ్బుతంగా నటించాడు. తెలుగు స్పష్టంగా రాకపోయినా తన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకోవడం పని పట్ల ఆయన ఎంత పట్టుదలతో ఉంటారో నిరూపిస్తుంది. గాయత్రిగా మిడిల్ క్లాస్ గృహిణిగా గౌతమి నటన అధ్బుతం. ఏ సీన్ లోని గౌతమి కనిపించదు. పాత్ర మాత్రం కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో గౌతమి నటన ప్రేక్షకులను కట్టి పడేసింది. మహితగా నటించిన రైనారావ్ సినిమాకు బలంగా మారింది. హావభావాలు పలికించడంలో ఎక్కడా… ఫెయిల్ కాలేదు. విశ్వాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వెన్నెల కిషోర్, హర్షవర్ధన్ వారి పాత్రల పరుధుల్లో చక్కగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు : విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో పేరు గాంచిన చంద్రశేఖర్ ఏలేటి మరో సారి తన స్టైల్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. నాలుగు పాత్రలను క్లైమాక్స్ కు ఒక చోటుకు చేర్చడం డైరెక్టర్ ప్రతిభకు నిదర్శనం. అనుకున్న పాయింట్ ను ఎగ్జిక్యూట్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. నాలుగు కథలను ఒకేసారి చెబుతున్నా.. ప్రేక్షకుల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ కలగకుండా పూస గుచ్చినట్టు వివరించారు. పాటలు వింటునప్పటి కంటే తెరపై చూసినప్పుడు ఇంకా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. మొదటి భాగం కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. సినిమా కథ బాగుండడంతో పెద్ద మైనస్ గా కనిపించదు.

విశ్లేషణ : రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు ఈ సినిమా భిన్నం. ఇందులో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ప్రేక్షకులకు నచ్చే కథ, వారు మెచ్చే విధంగా మలిచిన కథనం ఈ సినిమాలో ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు మన జీవితలను తెరపై చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ నలుగురి జీవితాలకు సంబంధించిన కథను ప్రేక్షకులకు చెప్పే విధానం అధ్బుతమనే చెప్పాలి. మిడిల్ క్లాస్ మనుషులు ఎలా ఆలోచిస్తారనే విషయాలను వాస్తవానికి దగ్గరగా చూపించారు. కొన్ని సన్నివేశాలు చాలా త్రిల్లింగ్ గా ఉంటాయి. ఏ వర్గపు ప్రేక్షకుడైనా ఈ చిత్రానికి కనెక్ట్ అవ్వడం ఖాయం. కొత్తదనం కోరుకునే ప్రతి ప్రేక్షకుడు మెచ్చే చిత్రం ‘మనమంతా’.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus