మంచు లక్ష్మి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కష్టం. ఎందుకంటే నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా విజయం సాధించింది. అంతేకాదు వివిధ అవార్డుల కార్యక్రమాల్లో వేదికలపై యాంకర్ గా తనదైన శైలిలో మాట్లాడి ఆకట్టుకుంది. తనతండ్రి మోహన్ బాబు మాదిరిగా విలన్ పాత్రలో మెప్పించి హీరోయిన్ గా కవ్వించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ అయింది. తాజాగా విజయ్ యెలకంటి దర్శకత్వంలో “వైఫ్ ఆఫ్ రామ్” ఈ థ్రిల్లర్ మూవీ చేసింది. టీజర్ తో ఆసక్తి కలిగించిన ఈ మూవీ ఈనెల 20 న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని విషయాలను పంచుకున్నారు. “‘వైఫ్ ఆఫ్ రామ్’ తో మంచి హిట్ అందుకుంటాను. ఈ సినిమా నా కెరీర్ ను మలుపుతిప్పుతుందని నమ్ముతున్నా” అని అన్నారు.
ఈ సినిమాలో తాను చాలా సీరియస్ క్యారెక్టర్ చేసినట్లు ఆమె తెలిపింది. కానీ ఈ తరహా క్యారెక్టర్లు ఇకపై తాను చేయాలనుకోవట్లేదని లక్ష్మి షాక్ ఇచ్చింది. “కెరీర్ ఆరంభంలోనే నెగెటివ్ రోల్ చేశాను. ఆ తర్వాత హీరోయిన్ గా చేసినా అవి కూడా సీరియస్ గా ఉండేవే. అందుకే ఈ తరహా క్యారెక్టర్లు బోర్ కొట్టేశాయి. అల్లరి పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను” అని మంచు లక్ష్మి మనసులోని కోరికని బయటపెట్టింది. “‘ఢిల్లీ బెల్లీ’ తరహా అడల్ట్.. స్లాప్ స్టిక్ కామెడీలు చేయాలని ఉంది. తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలి” అని కోరుకుంది. ఆ సమయం మరెంతో దూరంలో లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.