Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వైభవ్ రాజ్ గుప్తా (Hero)
  • వాణి కపూర్ (Heroine)
  • సుర్వీన్ చావ్లా, శ్రియ పిల్గాంకర్, అదితి పోహంకర్ తదితరులు.. (Cast)
  • గోపి పుత్రన్ - మానన్ రావత్ (Director)
  • ఆదిత్య చోప్రా - ఉదయ్ చోప్రా (Producer)
  • సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా (Music)
  • షాజ్ మహమ్మద్ (Cinematography)
  • మితేష్ సోని - మేఘన మణిచందన సేన్ (Editor)
  • Release Date : జూలై 25, 2025
  • వై.ఆర్.ఎఫ్ ఎంటర్టైన్మెంట్ (Banner)

బాలీవుడ్ నుంచి వచ్చిన తాజా వెబ్ సిరీస్ “మండల మర్డర్స్”. వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, శ్రియ పిల్గాంకర్, అదితి పోహంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. మూఢ నమ్మకాలు, వరుస హత్యలు నేపథ్యంలో తెరకెక్కి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగింది? అనేది చూద్దాం..!!

Mandala Murders Web Series Review

కథ:

చంద్రాస్ పూర్ లో ఓ శవం చాలా దారుణంగా కుట్టబడి నదిలో తేలుతుంది. దాంతో ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా), రియా థామస్ (వాణి కపూర్)కి లోకల్ పొలిటికల్ లీడర్ అనన్య భరద్వాజ్ (సుర్వీన్ చావ్లా) అడ్డంకిగా నిలుస్తుంది.

అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ మృతదేహాలపై పుట్టుకొస్తున్న సింబల్స్ అర్థం ఏమిటి? ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారు? ఈ కేస్ ను విక్రమ్ & రియా ఎలా ఛేదించారు? అనేది “మండల మర్డర్స్” కథాంశం.

నటీనటుల పనితీరు:

సుర్వీన్ చావ్లాను ఇదే తరహా పాత్రల్లో చూసి బోర్ కొట్టేయడం వలనో ఏమో కానీ.. కథకి ఎంతో కీలకమైన ఆమె పాత్ర సరిగా పండలేదు. మరీ ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ లో ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ అనేది పేలవంగా మిగిలిపోయింది.

ఇక వాణికపూర్ నటన ఎందుకో చాలా రిజిడ్ గా అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో మరీ ఎక్కువగా బిగుసుకుపోయింది. అలాగే.. చాలా ఎమోషనల్ గా ఉండాల్సిన సన్నివేశాల్లోనూ సైలెంట్ గా ఉండిపోయింది. అందువల్ల ఆ పాత్ర కూడా పండలేదు.

శ్రియ పిల్గాంకర్ సిరీస్ కి మెయిన్ హైలైట్. చాలా బలమైన పాత్ర పోషించి, సిరీస్ ని నిలబెట్టింది. అలాగే.. అదితి పోహంకర్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

వైభవ్ రాజ్ గుప్తా చూడ్డానికి విశ్వక్ సేన్ లా కనిపించాడు. మంచి నటనతో సిరీస్ కి వెల్యూ యాడ్ చేశాడు.

మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఆండర్ గ్రౌండ్ సెట్ కానీ, ఆ ఫ్యూచరిస్టిక్ డివైజ్ కానీ చాలా నేచురల్ గా ఉన్నాయి. అలాగే.. కాస్ట్యూమ్స్ కూడా చాలా పర్టిక్యులర్ గా ఉన్నాయి. అలాగే.. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. టైమ్ లైన్ లో వేరియేషన్ కానీ, నైట్ షాట్స్ కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. అలాగే.. నేపథ్య సంగీతం కూడా సస్పెన్స్ బిల్డ్ చేయడంలో కీరోల్ ప్లే చేసింది.

దర్శకరచయితలు గోపి పుత్రన్ – మానన్ రావత్ ఎంచుకున్న కోర్ పాయింట్ బాగున్నప్పటికీ.. ఆ కథను నడిపించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడం మెయిన్ మైనస్. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో మొదటి 3 ఎపిసోడ్ల వరకు కంటెంట్ ఓ మోస్తరుగా అలరించగా.. ఆఖరి 5 ఎపిసోడ్లు మాత్రం అవసరమైన స్థాయిలో ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. అసలు ఎందుకు చంపుతున్నారు? వారి శరీర భాగాలతో అవసరం ఏంటి? అనే విషయాన్ని ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా యాంటిసిపేషన్ మిస్ అయ్యింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే.. దర్శక ద్వయం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు.

విశ్లేషణ:

సిరీస్ నేపథ్యం మినహా మిగతా అంతా చాలా వీక్ గా ఉంది. అలాగే క్యాస్టింగ్ లో చాలా తప్పులు జరిగాయి. కీలకపాత్రధారులను ఎంచుకోవడంలోనే దర్శకబృందం విఫలమైంది. అన్నిటికీ మించి ప్రొడక్షన్ టీమ్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికీ.. దాన్ని వినియోగించుకుని మంచి కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో బృందం ఫెయిల్ అయ్యింది. ఆ కారణంగా “మండల మర్డర్స్” ఓ సగటు రెగ్యులర్ థ్రిల్లర్ గా మిగిలిపోయిందే కానీ.. స్టాండవుట్ అవ్వలేకపోయింది.

ఫోకస్ పాయింట్: బోరింగ్ మర్డర్స్!

 

రేటింగ్: 1.5/5

చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus