రాజకీయం పులుముకోనున్న మణిరత్నం సినిమా..!

దర్శక దిగ్గజం మణిరత్నం ప్రేమకథలు తెరకెక్కించడంలో దిట్ట అని అంటుంటారు. అయితే ఆయనకు తెలిసింది ఎంచుకున్న కథని ప్రేక్షకలోకం ఊహించని రీతిలో తెరపై ఆవిష్కరించి వారిని అబ్బురపరచడమే. ఎవరో అన్నారని ఆయన ప్రేమకథలకే పరిమితమయ్యుంటే ‘దళపతి’, ‘నాయగన్'(తెలుగులో నాయకుడు) వంటి సినిమాలను చూసేవారమా..? అయితే ప్రేమకథలు ఆయనకి విజయాలు ఎక్కువగా ఇచ్చాయి.కొన్ని పరాజయాల తర్వాత ‘ఓకే బంగారం’ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన మణిరత్నం ప్రస్తుతం కార్తి, అదితి రావు హీరో హీరోయిన్లుగా ‘కాట్రు వెళియిడై’ (తెలుగులో డ్యూయెట్) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తుది దశకు చేరుకున్న తరుణంలో మణిరత్నం తన తర్వాతి సినిమాపైనా దృష్టి సారిస్తున్నారట.

ఈసినిమా కోసం కూడా ఓ యువ హీరోతోనే ఈ అగ్ర దర్శకుడు చేయి కలపనున్నాడు. అందుకోసం తమిళనాట వరుస విజయాలతో హీరోగా దూసుకుపోతున్న అథర్వని ఎంపిక చేసినట్టు సమాచారం. కార్తీ సినిమా ప్రస్తావనకు వచ్చినప్పుడే అథర్వ-మణిరత్నం సినిమాపైనా గుసగుసలు వినిపించగా అది ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. కాగా ఈ చిత్ర కథ రాజకీయ రంగు పులుముకుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు పదేళ్ల క్రితం ఇరువర్ (తెలుగులో ఇద్దరు) సినిమాలో రాజకీయ సవాళ్ళను, ఎత్తుగడలను ప్రేక్షకుల కళ్ళకు కట్టిన మణిరత్నం మరోమారు ఆ నేపథ్యంలో చేస్తున్న ఈ సినిమాకి ‘ఎదుర్ కట్చి’ (ప్రతిపక్షం అని అర్థం) అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. మరి దీనిపై అధికారిక కబురు ఎప్పుడు అందుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus