పాతికేళ్ల క్రితం సోషల్ మీడియా ఉండి ఉంటే.. ఈ వార్త వైరల్ అయ్యేది. ఎందుకంటే నిజంగానే మంజులను బాలకృష్ణ పక్కన నటింపచేయించాలని అనుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ చిన్న కుమార్తె మంజుల కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఎప్పుడెప్పుడు వెండితెరపై కనిపిద్దామా.. అని ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. అందుకుగల కారణాన్ని రీసెంట్ గా మంజుల బయటపెట్టారు. తొలిసారి మెగా ఫోన్ అందుకొని చేసిన సినిమా “మనసుకు నచ్చింది” ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. “నాన్నగారి (కృష్ణ)తో ‘నంబర్ వన్’ సినిమా తీసిన ఎస్వీ కృష్ణారెడ్డి, నందమూరి బాలకృష్ణ హీరోగా టాప్ హీరో తీయాలనుకున్నారు. అందులో నన్నే హీరోయిన్ గా అనుకున్నారు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను.
అయితే అప్పుడు ముఖానికి నల్ల ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు.. పెట్రోల్ క్యాన్లు పట్టుకుని పద్మాలయ స్టూడియోకు వచ్చారు. నాన్న ముందు నిలబడి “మంజుల నటిస్తే తగలబెట్టుకుని చచ్చిపోతాం” అని గొడవ చేశారు. మంజుల సినిమాల్లో నటించదని ప్రకటన చేసేవరకు వాళ్లు ఒప్పుకోలేదు. ముందు వాళ్ల మీద నాకు కోపం వచ్చినప్పటికీ.. వాళ్లు నన్ను ఓ చెల్లెలిలాగా.. ఇంటి ఆడపడుచు లాగా భావించి నటించడానికి ఒప్పుకోలేదని.. కాబట్టే నేను నటి అవ్వాలనే కోరికను అణుచుకున్నాను” అని మంజుల వెల్లడించారు.