గత వారం అన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మినిమమ్ బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ వారం అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో కూడా చాలా క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘మాన్షన్ 24′ ఒకటి. హర్రర్ సినిమాలు తీయడంలో ఓంకార్ ఆరితేరిన వ్యక్తి.’రాజుగారి గది’ సీక్వెల్స్ తో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు.
అందులోనూ ‘మాన్షన్ 24’ టీజర్, ట్రైలర్లు ఆసక్తిని కలిగించాయి. అంతేకాకుండా ఇందులో సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి స్టార్లు ఉన్నారు. కాబట్టి ఈ సిరీస్ పై ఆసక్తి పెరగడానికి అది కూడా ఓ కారణమని చెప్పవచ్చు. మరి ‘మాన్షన్ 24’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : అమృత (వరలక్ష్మీ శరత్ కుమార్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆమె తండ్రి కాళిదాస్ (సత్యరాజ్) పురాతన వస్తు శాఖలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఇతను తవ్వకాల్లో దొరికిన విలువైన సంపదతో పారిపోయాడని కథనాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు కాళిదాసుపై దేశద్రోహి కేసు కూడా నమోదవుతుంది.దీంతో అతని ఫ్యామిలీ పై ప్రజలు, మీడియా మానసికంగా దాడి చేయడం మొదలుపెడుతుంది. అమృత తల్లి(తులసి) కూడా హాస్పిటల్ పాలవుతుంది. అయితే తన తండ్రి దేశద్రోహి కాదని,నేను ఓ నిజాయతీపరుడైన కాళిదాసు కూతుర్ని అంటూ అమృత మీడియాని ఫేస్ చేస్తుంది.
అలాగే తన తండ్రి నిర్దోషి అని నిరూపించాలని భావించి… అతను చివరిగా వెళ్లిన.. ఊరికి ఉత్తరాన, ఓ కొండపై ఉన్న మ్యాన్షన్‌కు వెళ్తుంది. అక్కడ ఆమెకి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అవి ఏంటి? ఆ మాన్షన్ లో దెయ్యాలు ఉన్నాయా… అవే అమృత తండ్రి కాళిదాసుని చంపేశాయా? ఈ విషయాలు అన్నీ తెలుసుకోవాలి అంటే ‘మాన్షన్ 24’ చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా బాగా చేసింది. కాకపోతే గతంలో ఆమె చేసిన ‘నాంది’ కి చాలా సిమిలర్ గా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో వరలక్ష్మీ ఇమేజ్ కి తగ్గ సీన్లు పడ్డాయి. రావు రమేశ్ మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా కనిపించారు అని చెప్పొచ్చు. సత్యరాజ్ ఈ సిరీస్ లో నటించారు అనే కంటే కూడా కనిపించారు అని చెప్పాలేమో. ఎందుకంటే ఆయన పాత్ర నిడివి అంత తక్కువ కాబట్టి.
కానీ కథ మొత్తం ఇతని పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తులసి పాత్ర కూడా అంతే.! అభినయ ,రాజీవ్ కనకాల… పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవికా గోర్ , బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి,’కెజియఫ్’లో రాఖీభాయ్ తల్లిగా చేసిన అర్చనా జాయిస్…ఉన్నంతలో బాగానే నటించారు అని చెప్పాలి.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘రాజుగారి గది’ సీక్వెల్స్ విషయంలో కామెడీ కూడా ప్లస్ అయ్యింది. అయితే ఈ ‘మాన్షన్ 24’ విషయంలో కామెడీని పక్కన పెట్టేశాడు దర్శకుడు ఓంకార్. ఎప్పుడైతే తన బలాన్ని పక్కన పెట్టేశాడో… అప్పుడు అతనికి ఇది ఇంకా ఛాలెంజింగ్ గా మారింది అని చెప్పొచ్చు. అయినప్పటికీ ‘మాన్షన్ 24’ ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కాకపోతే హర్రర్ సినిమాల్లో ట్విస్ట్ లు కూడా కీలకంగా ఉంటాయి.
‘ఇందులో అలాంటివి లేవు. ఎంగేజింగ్ గా కథని చెప్పాలనుకున్నాడు.థ్రిల్లింగ్ అనిపించే అంశాలు లేవు. ఇక మరో విషయం ఏంటి అంటే.. ఈ సిరీస్ లో పాటలు కూడా ఉండటం. అది సీరియస్ మోడ్ ను పక్కకు డైవర్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.అదొక మైనస్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఓకే.
విశ్లేషణ : మొత్తంగా ఈ ‘మాన్షన్ 24’ కొన్ని చోట్ల భయపెట్టింది. పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఎంగేజ్ చేసింది. క్లైమాక్స్ కనుక ఇంకాస్త బాగా డిజైన్ చేసుంటే.. తప్పకుండా దీని స్థాయి మరో రేంజ్లో ఉండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏదేమైనా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 6 ఎపిసోడ్లుగా అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.
రేటింగ్ : 2.5/5