మను

  • September 6, 2018 / 12:43 PM IST

“మధురం” అనే షార్ట్ ఫిలిమ్ చూసినవాళ్ళకి పరిచయం చేయనక్కర్లేని పేరు ఫణీంద్ర నర్సెట్టి. ఈ షార్ట్ ఫిలిమ్ మేకర్ ఇప్పుడు ఫిలిమ్ మేకర్ గా మారి తెరకెక్కించిన చిత్రం “మను”. తెలుగు సినిమా చరిత్రలోనే ఫాస్తెస్ట్ & బిగ్గెస్ట్ క్రౌడ్ ఫండెడ్ ఫిలిమ్ గా రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ కథానాయకుడిగా నటించగా.. చాందిని చౌదరి కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్ తో విశేషమైన క్రేజ్ ను క్రియేట్ చేసిన ఈ “మను” సినిమాగా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!


కథ:  ఈస్ట్ కోస్ట్ సముద్రతీరంలోని “సియా” అనే దీవిలో నివసించే ఓ స్కిల్డ్ ఆర్టిస్ట్ మను (రాజా గౌతమ్), అదే దీవిలో ఫోటో స్టూడియో రన్ చేస్తూ తండ్రితో కలిసి నివశిస్తుంటుంది నీల (చాందిని చౌదరి). మను ఆర్ట్ అంటే విపరీతమైన ఇష్టం కలిగిన నీల అతడ్ని ఒకసారి బార్ లో కలుస్తుంది, కానీ తొలి పరిచయంలోనే గౌతమ్ కావాలని చేయని పనికి నీలాపనిందలు పడాల్సి వస్తుంది.
అలా గొడవతో మొదలైన మను-నీలల పరిచయం ప్రేమగా రూపాంతరం చెంది ఆ ప్రేమ ఇంకాస్త ముందుకెల్లే తరుణంలో వీళ్ళిద్దరి జీవితంలోకి ప్రవేశిస్తారు అమర్- అక్బర్-ఆంటోనీ (శ్రీకాంత్, జానీ కొట్టోలి, మోహన్ భగత్) & రంగ (అభిరామ్ వర్మ). ఈ నలుగురి ఆగమనంతో మను-నీలల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకొంటాయి. వీరి ప్రేమ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే “మను” చిత్రం చూడాల్సిందే.


నటీనటుల పనితీరు: “మను” చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన రాజా గౌతమ్ ను చూస్తే “పల్లకిలో పెళ్లికూతురు” చిత్రంతో హీరోగా పరిచయమైంది ఈ అబ్బాయేనా? అనే డౌట్ రాక మానదు. కంప్లీట్ బాడీ & లుక్స్ ట్రాన్స్ ఫార్మేషన్ తో సరికొత్తగా కనిపించడమే కాక సన్నివేశానికి తగ్గ నటనతో ఆకట్టుకొన్నాడు కూడా. టైటిల్ పాత్ర కావడం, కథ కూడా రాజా గౌతమ్ పాత్ర చుట్టూనే తిరుగుతుండడంతో అతడి పాత్ర ద్వారా అతడు చూపే పరిపక్వత నటుడిగా అతడి ఎదుగుదలకు ప్రతీకగా నిలుస్తుంది.
చాందిని చౌదరి సినిమాల్లోకి ఎంటర్ అయ్యాక ఆమె నట ప్రతిభను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే కాక ఆమెలోని నటిని వెండితెర ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం “మను”. తన పాత్రను సమర్ధవంతంగా పోషించడమే కాదు ఆకట్టుకొంది కూడా.
రాజా గౌతమ్, చాందిని తర్వాత వాళ్ళిద్దరినీ మించిన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్న నటుడు అభిరామ్ వర్మ. చాలా టిపికల్ రోల్ లో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు అభిరామ్. ఉన్నవి తక్కువ సన్నివేశాలే అయినప్పటికీ నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు.
ఇక థియేటర్ ఆర్టిస్ట్స్ మోహన్ భగత్, జానీ కొట్టోలీలు తమ పాత్రలకు న్యాయం చేయడమే కాక తమ మ్యానరిజమ్స్ తో ప్రేక్షకుల్ని అలరించారు.
ఇలా ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను పండించడానికి ప్రయత్నించి సఫలమయ్యారు.


సాంకేతికవర్గం పనితీరు: నరేష్ కుమారన్ నేపధ్య సంగీతం & సౌండ్ డిజైనింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ ఆయువుపట్టుగా నిలుస్తుంది. ఈ లో బడ్జెట్ ఫిలిమ్ కి వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన అవుట్ పుట్ ప్రశంసార్హం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఆకుల పనితనాన్ని కూడా మెచ్చుకోవాలి. సినిమా మొత్తం కేవలం రెండు లేదా మూడు గదుల్లో జరుగుతున్నప్పటికీ ప్రేక్షకుడికి ఆ ఫీల్ రాదు. పోనీ ఆ సెట్ ను ఏమైనా రామోజీ ఫిలిమ్ సిటీలో వేశారా అంటే అదీ కాదు. ఎక్కడో హైద్రాబాద్ శివార్లలోని ఓ సిమెంట్ గుడౌన్ లో ఆ సెట్ ను వేసి అక్కడే చిత్రీకరించారు.

దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి రాసుకొన్న కథలో నవ్యత, తెరకెక్కించే విధానంలో నాణ్యత ఉండడంతో “మను” ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ఫణీంద్ర ఆలోచనలు, వాటిని స్క్రీన్ పై ప్రెజంట్ చేసిన విధానం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడం ఖాయం. కొన్ని సన్నివేశాల్లో అతడి ఆలోచనా విధానానికి, దృష్టికోణానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. కాకపోతే.. “మను” అన్నీ వర్గాల ప్రేక్షకులకి నచ్చే చిత్రం కాదు. అలాగే.. టీజర్ * ట్రైలర్ చూసి భీభత్సమైన ఎక్స్ పెక్తేషన్స్ తో సినిమా చూడ్డానికి వెళ్ళకండి. ఎంప్టీ మైండ్ తో.. లో ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కి వస్తే మాత్రం ఫణీంద్ర నర్సెట్టి “మను” ఒక వైవిధ్యమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడం ఖాయం.


విశ్లేషణ:  “మను” విభిన్నమైన స్క్రీన్ ప్లేతో సాగే వైవిధ్యమైన చిత్రం. రాజా గౌతమ్, చాందినిల కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మరియు ఫణీంద్ర నర్సెట్టి ఆశ్చర్యపరిచే ఆలోచనలను అనుభూతి చెందడం కోసం కొత్తతరహా చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. రెగ్యులర్ & కమర్షియల్ సినిమాలను ఆస్వాదిస్తూ.. ఎంటర్ టైన్మెంట్ కోరుకొనే ప్రేక్షకులు ఈ చిత్రానికి దూరంగా ఉండడం బెటర్.


ఇది సినిమా ప్రేమికుల విరాళాలతో రూపొందిన ప్రయోగాత్మక చిత్రం గనుక రేటింగ్ ఇవ్వడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus