మన్యం పులి

  • December 2, 2016 / 09:25 AM IST

మలయాళ చలనచిత్ర చరిత్రలో 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొట్టమొదటి సినిమాగా రికార్డ్ సృష్టించిన చిత్రం “పులి మురుగన్”. మోహన్ లాల్, జగపతిబాబు కీలకపాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో “మన్యం పులి” పేరుతో అనువదించారు. మరి మలయాళంలో రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం తెలుగులో ఏమేరకు ఆడుతుందో చూద్దాం..!!

కథ : కుమార్ అలియాస్ పులి కుమార్ (మోహన్ లాల్) మన్యంలో నివసించే ఓ సగటు యువకుడు, తన తల్లిదండ్రులను తుదముట్టించిందనే కోపంతో చిన్న వయసులోనే పెద్ద పులిని అత్యంత సూయాసంగా హతమార్చి, “మన్యం పులి”గా మారతాడు. ఆ తర్వాత అదే మన్యంలో భార్యా (కమలినీ ముఖర్జీ) తమ్ముడితో సరదాగా జీవనం సాగిస్తున్న కుమార్ జీవితంలోకి ప్రవేశిస్తాడు డాడీ గిరిజ (జగపతి బాబు). డాడీ కారణంగా కుమార్ తమ్ముడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు కుమార్ తమ్ముడు డ్రగ్స్ కేసులో ఎలా ఇరుక్కొన్నాడు, దానికి డాడీ ఏ విధంగా కారకుడయ్యాడు, చివరికి డాడీపై కుమార్ ఎలా గెలిచాడు వంటి అంశాలకు వీలైనంత మసాలా జోడించిన కథాంశమే “మన్యం పులి”.

నటీనటుల పనితీరు : మోహన్ లాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. అయితే.. ఈ సినిమాలో వయసుడుకుతున్నప్పటికీ రిస్క్ చేసి పెర్ఫార్మ్ చేసిన యాక్షన్ సీన్స్ మాత్రం హైలైట్. బి, సి సెంటర్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. జగపతిబాబు విలన్ గా బోర్ కొట్టేశాడు. ముఖంలో క్రౌర్యం కనపడకుండా విలనిజాన్ని పండించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది, అయితే.. వాయిస్ తో ఆ లోపాన్ని కప్పిపుచ్చాడు. కమిలి ముఖర్జీ గృహిణి పాత్రకు న్యాయం చేయగా.. కనిపించేది నాలుగు సన్నివేశాల్లోనే అయినప్పటికీ.. నడుమందాలతో కనువిందు చేసింది నమిత. ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. ఒక మలయాళ డబ్బింగ్ సినిమా నుంచి ఈ స్థాయి క్వాలిటీ ఎక్స్ ఫెక్ట్ చేయని ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ కంటే ముందు వచ్చే గ్రాఫిక్స్ ఎపిసోడ్ అబ్బురపరచడం ఖాయం. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాను దృశ్య కావ్యంలా మలచింది. లారీ ఛేజింగ్ మరియు మాంటేజ్ సీన్స్ కోసం వాడిన ఫ్లై కామ్ షాట్స్, పులితో ఫైట్ సీన్ లో వచ్చే టైట్ క్లోజ్ లు ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఫీల్ ను కలిగిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎడిటింగ్ ఎఫెక్ట్స్ అలరిస్తాయి. కాకపోతే రెండు గంటల నలభై నిమిషాల నిడివి మాత్రం ఇబ్బందిపెడుతుంది.

దర్శకుడు కథను పక్కన పెట్టేసి, కేవలం కథనంపై కాన్సన్ ట్రేట్ చేసిన విధానం కాస్త ఇబ్బందిపెట్టినా.. స్క్రీన్ ప్లేతో కథను పరిగెట్టించిన విధానం మాత్రం అలరిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ మరీ “ఓవర్” అనిపించినప్పటికీ మాస్ ఆడియన్స్ మాత్రం విశేషంగా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి లాజిక్ తో పనిలేని ఎంటర్ టైన్మెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకొని వారిని అలరించేశాడు.

విశ్లేషణ : కథలో విషయం లేదు, కానీ కథనంలో పట్టు ఉంది. అందుకే కేవలం మాస్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే చిత్రంగా “మన్యం పులి” నిలుస్తుంది. సో, మోహన్ లాల్ అభిమానులు, బి-సి సెంటర్ ఆడియన్స్ మాత్రమే చూడదగ్గ చిత్రమిది.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus