‘మార్క్ ఆంటోని’ నుంచి విశాల్ పాడిన ‘అదరద గుండె’ లిరికల్ సాంగ్ విడుదల

నేటితరం హీరోలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తూనే తెర వెనుక కూడా సత్తా చాటుతున్నారు. అదేబాటలో వెళుతున్న హీరో విశాల్.. తాజాగా తన గొంతును సవరించుకొని తొలిసారి తెలుగులో ఓ సాంగ్ పాడారు. ఆయన చేస్తున్న ‘మార్క్ ఆంటోని’ మూవీ కోసం పాట పాడి హుషారెత్తించారు విశాల్. ఇటీవల విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమో జనం మెప్పుపొందింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

‘అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా మావ..” అంటూ సాగిపోతున్న ఈ పాటను విశాల్ ఫుల్ ఎనర్జీతో పాడారు. ఆయన ఎనర్జీకి తోడు సాంగ్ లో కనిపిస్తున్న విజువల్స్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ పాటకు ప్రాణం పోశాయి. మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చేలా యమ హుషారుగా పాట పాడుతూనే అంతకుమించిన ఎనర్జీతో ఈ పాటలో మాస్ లుక్ లో కనిపించారు హీరో విశాల్. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది.

పలు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్న విశాల్.. ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమాలో విశాల్ సరికొత్తగా కనిపించనున్నారు. గుబురు గడ్డంతో ఆయన కనిపించనుండగా.. ఎస్.జె.సూర్య కూడా ఆయనకు తోడు కావడం మరో అట్రాక్షన్. ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తుండగా.. యాక్షన్ సన్నివేశాలు పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్, సినిమాటోగ్రఫీ అభినందన్ రామానుజం, ఎడిటర్ విజయ్ వేలుకుట్టి బాధ్యతలు తీసుకున్నారు. టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ ఆద్యంతం అందరినీ అలరించనుందని మేకర్స్ అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus