మీకు మీరే మాకు మేమే

“నాన్నకు ప్రేమాతో” సినిమాకు రచనా సహకారం అండించడంతోపాటు.. దర్శకుడు సుకుమార్ ప్రశంసలు మెండుగా సంపాదించిన రైటర్ టర్నడ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కీంచిన చిత్రం “మీకు మీరే మాకు మేమే”. హీరోయిన్ అవంతిక, కమెడియన్ కిరీటి మినహా అందరూ కొత్త నటీనటులతో రూపోందించబడిన ఈ చిత్రం నేడు (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సమీక్ష మీకోసం..!!

కథ : ఆది (తరుణ్ శెట్టి) ఓ అల్లరి కుర్రాడు. ప్రియా (అవంతిక) జీవితం పట్ల చాలా క్లారిటీ ఉన్న అమ్మాయ్. ఈ ఇద్దరి మధ్య అనుకోని విధంగా ప్రేమ చిగురిస్తుంది. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ.. తర్వాతర్వాత బాగా బోర్ కొట్టేస్తుంది ఇద్దరికీ. అందుకే ఒక ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాలనుకొంటారు ఈ ఇద్దరు.
ఈ ఆరు నెలల విరామంలో వీరిద్దరి మధ్య తలెత్తిన సమస్యలేమిటి?
ఆది-ప్రియాల ప్రేమ చివరికి ఏ తీరానికి చేరుకొంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : ఆది పాత్రలో తరుణ్ శెట్టి జస్ట్ బిహేవ్ చేశాడు. సెంటిమెంట్ సీన్స్ మినహా.. మిగతా సన్నివేశాల్లో ఫర్వాలేదనిపించుకొన్నాడు. అవంతిక ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా అలరించలేకపోయినా.. అందాలతో మాత్రం ఆకట్టుకొంది.
కిరీటి తనదైన కామెడీతో నవ్వించగలిగాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నెటిజన్లకు సుపరిచితురాలైన జెన్నీ కూడా ఫర్వాలేదనిపించుకోంది.

సాంకేతికవర్గం పనితీరు : శ్రవణ్ సంగీతం, నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సూర్య వినయ్ కెమెరా వర్క్ కలర్ ఫుల్ గా ఉంది. సినిమాలోని సన్నివేశానికి మూడ్ కి తగ్గట్లుగా లైటింగ్ ను సెట్ చేసుకొన్నాడు.
మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ ఇంకాస్త స్ట్రిక్ట్ గా ఉంటే బాగుండేది. కథనాన్ని సరిగా నడిపించలేని సన్నివేశాలు కట్ చేస్తే.. ఇంకా బాగుండేది.

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : రచయితగా “నాన్నకు ప్రేమతో” చిత్రానికి పనిచేయడంతోపాటు పలు షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించిన హుస్సేన్ షా కిరణ్ “మీకు మేమే మాకు మీరే” కథను కూడా ఒక షార్ట్ ఫిలింకు రాసుకొన్నట్లే తయారు చేసుకొన్నాడు. అందువల్ల ఆ కథను రెండు గంటలపాటు నడిపించడానికి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది.
అనవసరమైన కామెడీ ట్రాక్ లు ఇరికించాడు. ఫస్టాఫ్ ను కామెడీతో బాగానే డీల్ చేశాడు కానీ, సెకండాఫ్ లో మాత్రం హీరోతోపాటు ఆడియన్స్ ను కూడా బాగా కన్ఫ్యూజ్ చేశాడు. ప్రేమకు నిర్వచనమిద్దామనుకొని డిజైన్ చేసిన క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఇబ్బందిపెడుతుంది.

మొత్తానికి..
సరదాగా సాగిపోయే మొదటి భాగం.. నత్తనడకలా సాగే మలిభాగం కలగలిసిన “మీకు మీరే మాకు మేమే” చిత్రాన్ని సరదాగా ఒకసారి చూడవచ్చు!

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus