ఇ.వి.వి ప్రియ శిష్యుడు ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించిన తాజా చిత్రం “మీలో ఎవరు కోటీశ్వరుడు”. నవీన్ చంద్ర, పృధ్వీ, శృతి సోధి, సలోని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి “బెంగాల్ టైగర్” ఫేమ్ ఎం.రాధామోహన్ నిర్మాత. స్పూఫ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం సమీక్ష మీకోసం..!!
కథ : ధనవంతురాలైన యువతి ప్రియ (శృతి సోధి) ఎప్పట్లానే పేదవాడైన హీరో ప్రశాంత్ (నవీన్ చంద్ర)ను ప్రేమించడం, ఆ ప్రేమను రిచ్ హీరోయిన్ కు రిచ్చెస్ట్ ఫాదర్ అయిన మురళీశర్మ నిరాకరించడం, అందుకు మన హీరోగారు పొగరుగా “మీరు మీ అమ్మాయిని సంతోషంగా ఉంచగలరేమో ఆనందంగా చూసుకోలేరు” అని ఒక డైలాగ్ వేస్తాడు.”ఆనందం” అంటే ఏంట్రా అని అడిగిన కాబోయే మామయ్యకి “ఏదైనా వ్యాపారంలో లాస్ అవ్వు, అప్పుడు తెలుస్తుంది” అని ఒక తొక్కలో లాజిక్ చెప్పడం, అలా లాస్ అవ్వడం కోసం హీరోయిన్ ఫాదర్ అర్జెంటుగా ఒక “ఫ్లాప్ సినిమా” తీయాలని ఫిక్సవ్వడం చకచకా జరిగిపోతాయి. అలా డిజాస్టర్ అవ్వాలనే ఆశయంతో మొదలుపెట్టిన సినిమా రిజల్ట్ ఏమయ్యింది, హీరో ఫాదర్ “ఆనందం” అంటే ఏమిటో తెలుసుకోగలిగాడా, హీరోహీరోయిన్లు క్లైమాక్స్ లో శోభనం గది వరకూ చేరుకోగలిగారా? వంటి పనికిమాలిన ప్రశ్నలకు చెప్పిన ప్రయోజనం లేని సమాధానాల సమాహారమే “మీలో ఎవరు కోటీశ్వరుడు” చిత్రం.
నటీనటుల పనితీరు : సినిమాలో హీరో లాంటి గెస్ట్ రోల్ ప్లే చేసిన నవీన్ చంద్ర “నేనసలు ఈ సినిమాలో హీరోనేనా” అని తాను కన్ఫ్యూజ్ అవుతూ ఆడియన్స్ ను కూడా కన్ఫ్యూజ్ చేశాడు. సినిమా మొత్తంలో గట్టిగా ఓ పది సీన్లు కూడా లేని క్యారెక్టర్ నవీన్ చంద్రది. హీరోయిన్ కి తక్కువ సైడ్ డ్యాన్సర్ కి ఎక్కువ అన్నట్లుగా ఉంది శృతి సోధి క్యారెక్టర్. ఆమె చేత చేయించిన అనవసరమైన ఎక్స్ పోజింగ్ దర్శకుడు పైత్యానికి పరాకాష్టలా ఉండడం గమనార్హం.
పృధ్వీ స్పూఫ్ కామెడీ కొంత మేరకు అలరించింది. అయితే.. మధ్యలో గ్యాప్ లేకుండా కంటిన్యూగా గంట సేపు కేవలం స్పూఫ్ తోనే సినిమా నడపడంతో ఆ కామెడీ కూడా కుళ్ళిపోయింది. సలోని పాత్ర బాలేకపోయినా.. ఆమె నటన, అందంతో ఆకట్టుకొంది. సినిమాలో ఉన్న అతి తక్కువ ప్లస్ పాయింట్స్ లో సలోని ఒకర్తి. ఫ్లాప్ ప్రొడ్యూసర్ గా పోసాని పండించిన కామెడీ బాగుంది, రఘుబాబు కామెడీ అలరించలేకపోయింది. ఇక మిగతా ఆర్టిస్టులు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ అన్నట్లుగా ఓ మూలకి నిలబడిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు : డీజే వసంత్ పాటలు ఒక్కటి కూడా వినసోంపుగా లేకపోగా.. నేపధ్య సంగీతంతో అప్పటికే సన్నివేశంలోని ఎమోషన్ అర్ధం కాక కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రేక్షకుడి సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించేలా ఉంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మరీ బ్రైట్ గా ఉంది. హీరోయిన్ యద సంపదను బహిర్గతం చేసేందుకు పెట్టిన టైట్ క్లోజ్ లు ప్రేక్షకులు ఇబ్బందిపడే స్థాయిలో ఉండగా.. లాంగ్ షాట్స్ చిరాగ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ మినహా ఏ ఒక్క సాంకేతికవర్గం గురించి చెప్పుకొనే స్థాయిలో లేకపోవడం బాధాకరం.
దర్శకుడు ఇ.సత్తిబాబు తన కతలోనే కాదు నిజజీవితంలోనూ నిర్మాతకు “ఒక సూపర్ ఫ్లాప్ సినిమా” తీసిపెట్టాలన్న ధృడ నిశ్చయంతోనే “మీలో ఎవరు కోటీశ్వరుడు” చిత్రాన్ని తెరకెక్కించాడేమో అన్నట్లుగా ఉంది. సినిమాలో సినిమా అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ను హేయంగా తెరకెక్కించిన విధానం మాత్రం దర్శకుడిగా అతడి స్థాయిని దిగజార్చింది. ఇక సినిమా మొత్తం పృధ్వీ మీదే కాన్సన్ ట్రేట్ చేసి మెయిన్ లీడ్ పెయిర్ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.
విశ్లేషణ : ఒక సినిమాను ఎలా తీయకూడదు, సినిమాలో ఎటువంటి అంశాలను హైలైట్ చేయకూడదు అనే విషయానికి నిదర్శనం “మీలో ఎవరు కోటీశ్వరుడు”. 129 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో మహా అయితే ఓ పదిహేను నిమిషాలు మాత్రమే ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. మిగతా సమయంలో “సినిమా ఎప్పుడు అయిపోతుందా” అనే ఆరాటపడుతుంటాడు.
రేటింగ్ : 1/5