తెలుగులో 5 ఏళ్ల క్రితమే తొలి సినిమా చేసిన మీనాక్షి చౌదరి.. సరైన విజయం అందుకోవడానికి, వరుస అవకాశాలు పొందడానికి చాలా సమయమే తీసుకుంది. అయితే గతేడాది నుండి ఆమె లక్ మారింది. హిట్ సినిమాలు అందించే లక్కీ హీరోయిన్ అయింది. ఇప్పుడు ఆమె సౌత్‌లో ఒక్క సినిమానే ఉంది. అయితే వరుస సినిమాలు చేయడం వల్ల కాస్త రెస్ట్ తీసుకోవడమే ఈ గ్యాప్‌కి కారణం అని చెప్పాలి. అయితే ఈ గ్యాప్‌ను ఓ బాలీవుడ్ ఓకే చేసి ఫిల్ చేసే ఆలోచన చేసింది.
అవును, మీనాక్షి చౌదరి ఓ బాలీవుడ్ సినిమాను ఓకే చేసిందట. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ రెండు భారీ విజయాలు అందుకున్న మీనాక్షి చౌదరి ‘ఫోర్స్ 3’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ జాన్ అబ్రహం హీరోగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో యాక్షన్ కోణంలో సాగే పాత్రను పోషిస్తోందట. దీని కోసం త్వరలోనే యాక్షన్ వర్క్ షాప్‌లకు మీనాక్షి హాజరవుతుందట.
నవంబరు నుండి ప్రారంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో థియేటర్లలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మీనాక్షి ప్రస్తుతం తెలుగులో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా తెలుగులో ఆమె ఇంకే సినిమా చేయడం లేదు. కొంతకాలం బాలీవుడ్ మీద ఫోకస్ పెడదాం అని ఆమె అనుకోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు. మరి ఈ ప్రయత్నంలో ఆమె మరో రష్మిక మందన అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి.
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అవ్వడానికి అవసరమైన ఫిగర్, అందం రెండూ ఉన్న భామ మీనాక్షి చౌదరి. మరి ఏ స్థాయిలో బాలీవుడ్‌లో తన మార్కు చూపిస్తుంది అనేది చూడాలి. ఒకవేళ అక్కడ రాణిస్తే.. ఇక్కడ మరో హీరోయిన్ కోసం డైరక్టర్లు వెతుకులాట ప్రారంభించాల్సి వస్తుంది.