మేకసూరి 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 29, 2020 / 03:27 PM IST

కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను కుర్చీ మీద మునివేళ్లపై నిలబెట్టిన సినిమా మేకసూరి. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా వుండే ఫ్యాక్షన్, పగ, ప్రతీకారాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్‌గా ఈ శుక్రవారం జీ 5 యాప్ ద్వారా మేకసూరి 2ని విడుదల చేసింది చిత్ర యూనిట్. మరి పార్ట్ 1 స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్న దానిని చూస్తే..

తొలి భాగంలో సింగరాయకొండ గ్రామంలో జంతువల నెత్తురు తాగే సూరి (అభినయ్) కసాయిగా పనిచేస్తూ ఉంటాడు. అతను రాణి (సుమయ) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెద్ద అప్పలనాయుడు (శరత్ కుమార్) ఇద్దరితో కలిసి తన భార్య రాణిపై అత్యాచారం చేసి చంపడంతో సూరి రాక్షసుడిలా మారిపోతాడు.

తన భార్యను కిరాతకంగా చంపిన వారిపై సూరి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మేకసూరి పార్ట్ 2 కథ. మేకసూరి వెనుక వున్న దళం ఏమిటీ..? ఆ దళానికి అతనికి మధ్య వున్న సంబంధం ఏమిటీ..? దళంతో కలిసి మేక సూరి గోపాలరావును ఎందుకు చంపాడు..? అనే కోణంలో మొదలైన పార్ట్ 2లో మేకసూరి, దివాకర్‌లను పోలీసుల నుంచి తప్పించడానికి అన్నలు ఏం ప్లాన్ చేశారు..? ఇంతకీ పోలీసుల నుంచి మేకసూరి, దివాకర్‌లను తప్పించారా లేదా..? అసలు అన్నలు సూరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు..? వీటన్నింటి మధ్య పోలీస్ వీరభద్రంకు సూరిపై ఉన్న పగ ఎమిటీ??? అతనెందుకు సూరిని చంపాలనుకుంటున్నాడు..? చివరికి సూరికి వీరభద్రం చేసిన సాయం ఏమిటీ?? ఇన్ని ట్విస్ట్‌ల మధ్య మేకసూరి అనుకున్నది సాధించాడా, చివరికి కథ ఎలా ముగిసిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఘాటు, నాటుగా కనిపించే కథనాలతో మేకసూరి కథ సాగుతుంది. పకడ్బందీ స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలు, నటీనటుల ప్రతిభ, మన చుట్టూ జరుగుతుందనేలా వున్న కథ సినిమాను ముందుకు తీసుకెళ్లాయి. ఈ సినిమా మొత్తానికి ఆయువు పట్ట.. కథను నడిపించే పాత్ర సూరి. మెయిన్ లీడ్‌గా నటించిన అభినయ్ తన పాత్రకు తగ్గట్లు, తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్‌తో మొత్తం సినిమాను తన భుజాలపై మోశాడు. సూరి క్యారెక్టర్‌కు డిజైన్ చేసిన గెటప్ పాత్రకు చక్కగా సరిపోయింది. క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఇక వీరభద్రం పాత్ర పోషించిన నరేశ్ బైరెడ్డి పలికిన మాటలు ప్రేక్షకులను అలరించాయి. జర్నలిస్ట్ రఘురాం (శ్రవణ్) పాత్రలు కూడా బాగున్నాయి. సినిమాలో ఈ పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు త్రినాధ్ వెలిశాల స్క్రీన్‌ ప్లే సినిమాకు బలంగా మారింది. ట్విస్టులను హ్యాండిల్ చేయడంలో తన ప్రతిభను చాటుకున్నాడు. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి త్రినాథ్ ప్రయత్నించాడు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, తెలుగు నేటివిటీకి తగ్గ సీన్స్‌ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు. మేకసూరి 2 సినిమాకు ప్రధాన ఆకర్షణ ప్రజ్వల్ క్రిష్ అందించిన మ్యూజిక్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బాగా హైలెట్ చేసింది. ఓ మోస్తరుగా వున్న సీన్లను కూడా మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక పార్థూ సైనా అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సహజ సిద్ధమైన గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన సన్నివేశాలు మన ఇంటి పక్కనో, మన వూళ్లోనో ఈ కథ జరిగిన ఫీలింగ్ తెచ్చిపెట్టింది.

పగ, ప్రతీకారాలే లక్ష్యంగా సాగే ఓ యువకుడి కథే మేకసూరి. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో చేసిన ప్రయోగం ఈ సినిమాకు బలంగా మారింది. నిర్మాత కార్తీక్ కంచెర్ల ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. పాత్రలకు తగినట్లుగా నటీనటుల ఎంపిక తీరు సినిమాపై ఆయనకు వున్న అభిరుచికి అద్దం పట్టింది. మాస్ ఆడియన్స్‌కు ఈ క్రైమ్ థ్రిల్లర్ తప్పక నచ్చుతుంది.

విశ్లేషణ: వెకిలి నవ్వులు, అనవసరమైన కామెడీలు, చిరాకుపెట్టే హీరోయిన్ల ఎక్స్‌పోజింగులు లాంటివి లేకుండా.. కేవలం కథ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో సస్పెన్స్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాలు పుష్కలంగా వున్నాయి.

రేటింగ్: 2.75/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus