సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సూర్య నటిస్తూ నిర్మించిన ‘పసంగ-2’ చిత్రాన్ని తెలుగులో ‘మేము’ పేరుతో శుక్రవారం విడుదల చేశారు. సాయిమణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సూర్య, కె.ఇ.జ్ఞాన్ వేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగులో సంయుక్తంగా సమర్పిస్తున్నారు. అమలాపాల్, బిందుమాధవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో..లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం..!
కథ : నవీన్(మిశేష్), నయన(వైష్ణవి) అనే ఇద్దరు చిన్నారులు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. వారి ప్రవర్తన నచ్చక ఏ స్కూల్స్ లో అడ్మిషన్స్ దొరకవు. అడ్మిషన్ వచ్చినా.. తరువాత వారి చేసే అల్లరితో విసుగుపోయిన యాజమాన్యం వారికి టీసీ ఇచ్చి పంపించేస్తూ ఉండేవారు.
దీంతో వారిరువురు తల్లితండ్రులు పిల్లల్ని హాస్టల్ లో జాయిన్ చేస్తారు. హాస్టల్ ఉండలేక అక్కడ ఉండే పిలల్ల్ని భయపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి చేరతారు. అదే సమయంలో రామనాదం(సూర్య), పద్మ(అమలాపాల్) ల పిల్లలతో నవీన్, నయనలకు స్నేహం ఏర్పడుతుంది. రామనాదం ఓ చైల్డ్ సైకియార్ట్రిస్ట్. నవీన్, నయనల సమస్య అర్ధం చేసుకున్న రామనాదం ఆ సమస్యలను పరిష్కరించగలిగారా..?అసలు నిజంగానే వారికి ఏ.డి.హెచ్.డి అనే వ్యాధి ఉందా..? లేక వారి తల్లితండ్రులు పెట్టే ప్రెషర్ వలన అలా తయారయ్యారా..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..?
నటీనటుల పెర్ఫార్మన్స్ : చైల్డ్ సైకియార్ట్రిస్ట్ గా సూర్య నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. పిల్లల్ని సూర్య డీల్ చేసిన విధానం చూస్తుంటే నిజంగా.. డాక్టర్ అనే ఫీలింగ్ కలగకమానదు. పద్మ పాత్రలో అమలాపాల్ టీచర్ గా సెటెల్డ్ పెర్ఫార్మన్స్ చేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇద్దరు చిన్నారులు మిశేష్, వైష్ణవి. సినిమా మొత్తం వారిద్దరి మీదే నడుస్తుంది. చిన్న పిల్లలైనా.. ప్రతి సన్నివేశంలో అధ్బుతంగా నటించారు. వైష్ణవి క్లైమాక్స్ లో కనబరిచిన నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.
తల్లి తండ్రులు హాస్టల్ లో చేర్పించినప్పుడు ఇంకెప్పుడూ మేము తప్పు చేయమని వారు వేడుకునే సీన్స్ ప్రేక్షకులను ఎమోషన్స్ కు గురి చేస్తుంది. బిందు మాధవి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కార్తీక్, రాందాస్, విధ్య ఇలా ప్రతి ఒక్కరు చక్కగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు : ఈ సినిమాకు పెద్ద ప్లస్ కథ, కథనం. కథ పాతదే అయినా.. డైరెక్టర్ తన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇద్దరు చిన్నపిల్లలతో డైరెక్టర్ కథ నడిపిన తీరు అధ్బుతమనే చెప్పాలి. చిన్న పిల్లలతో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నింటితో పోలిస్తే మేము ప్రత్యేకంగా ఉంటుంది. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు, నేపధ్యసంగీతం మరీ గుర్తుపెట్టుకునే విధంగా కాకపోయినా.. ఎవరేజ్ గా ఉంటాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
విశ్లేషణ : రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు వస్తోన్న ఈరోజుల్లోపిల్లలతో సినిమా చేయాలనుకున్న డైరెక్టర్ ను అభినందించాల్సిందే. తల్లి తండ్రులు పిల్లలని పట్టించుకోకపోతే వారు ఎలా ఫీల్ అవుతారనే పాయింట్ ను కొత్తగా ప్రెజంట్ చేశారు. ఆ ఇద్దరు పిల్లలు చేసే అల్లరి దానిలోనుండి పుట్టే కామెడీతో సినిమా మొదటి భాగం ముగుస్తుంది. అసలు వారి సమస్య ఏంటని తెలుసుకొని డాక్టర్ గా సూర్య ఆ సమస్యలను పరిష్కరించడం తల్లి తండ్రులను పిల్లలకు దగ్గర చేయడం వంటి అంశాలతో రెండో భాగం ముగుస్తుంది. అయితే చూసే ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా.. డైరెక్టర్ చక్కగా డీల్ చేశాడు.
ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జాబ్స్చేస్తూ.. పిల్లలకి సమయం కేటాయించలేని ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా ప్రెజంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి..!
“మేము” మంచి ప్రయత్నం మాత్రమే కాదు.. తప్పక చూడాల్సిన చిత్రం!
రేటింగ్ : 3/5