మెర్క్యూరీ

కమల్ హాసన్-అమల జంటగా 1987లో వచ్చిన “పుష్పక్” అనంతరం సౌత్ ఇండియాలో దాదాపు 30 ఏళ్ల అనంతరం వచ్చిన మూకీ చిత్రం “మెర్క్యూరీ”. టాలెంటెడ్ డైరెక్టర్ కీర్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవ తన కెరీర్ లో మొదటిసారిగా నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ పోషించడం విశేషం. మూకీ చిత్రం కావడంతో అన్నీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : పాండిచ్చేరిలో మెర్క్యూరీ పాయిజనింగ్ కరణంగా 1992లో జరిగిన ఓ దుర్ఘటన కారణంగా 84 మంది మరణిస్తారు. ఆ కెమికల్ ఎఫెక్ట్ కారణంగా భవిష్యత్ తరాలు కూడా పలు రకాల ఫిజికల్ ఇంపెయిర్ మెంట్స్ తో బాధపడాల్సి వస్తుంది. అలా ఆ ఊరికి చెందిన చాలా మందిలో కొందరికి చెవులు, ఇంకొందరికి కళ్ళు, మరికొంతమందికి మాట పోతాయి. అలా ఒకే ఊరిలోని పాఠశాలలో చదువుకొన్న విద్యార్ధుల బ్యాచ్ లో అయిదుగురు (సనంత్ రెడ్డి, దీపక్ పరమేష్, శశాంక్, అనీష్, ఇందుజ) దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకొంటారు.

సరదాగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వీరి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అప్పుడు వాళ్ళ జీవితాల్లోకి ఎంటరవుతాడు ప్రభుదేవ. వీళ్ళందరి పాలిట యమధర్మరాజులా మారతాడు. అసలు ప్రభుదేవ వీళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చాడు? అతడి కారణంగా వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన మార్పులేమిటి? అనేది “మెర్క్యూరీ” కథాంశం.

నటీనటుల పనితీరు : ఒక్క ప్రబుదేవ మినహా నటీనటులందరూ కొత్తవారు, తమిళవారు కావడంతో వారి పాత్రలకు మన తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం అనేది కష్టం. అయితే.. వాళ్ళు కూడా ఓపెనింగ్ సీన్స్ లో చెవిటి-మూగవారిగా సరైన హావభావాలు పలికించలేకపోయారు. ముఖ్యంగా.. ఆడియన్స్ మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన యాక్సిడెంట్ సీన్ వారి పేలవమైన నటన కారణంగా తేలిపోయింది. ప్రభుదేవ ఈ చిత్రంలో నటుడిగా ఆశ్చర్యానికి గురి చేస్తాడు. నెగిటివ్ షేడ్ రోల్ లో ప్రభుదేవ నటన, అతడి ఆహార్యం అమితంగా ఆకట్టుకుంటుంది. మ్యానరిజమ్స్ పరంగా ఆంగ్ల చిత్రం “డోన్ట్ బ్రీత్”లోని కీలకపాత్రధారుడిని గుర్తుకు తెచ్చినప్పటికీ.. తన మార్క్ వేయగలిగాడు.

సాంకేతికవర్గం పనితీరు : సంతోష్ నారాయణ్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే.. మిథూన్ సౌండ్ డిజైనింగ్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. ముఖ్యంగా ప్రభుదేవ క్యారెక్టరైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేసేప్పుడు చేసిన సౌండ్ డిజైన్ థియేటర్ లో అప్పటివరకూ సైలెంట్ గా కూర్చున్న ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. తిరు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రేమింగ్స్, లాంగ్ షాట్స్, ఫ్లిప్ షాట్స్ భలే ఆకట్టుకొంటాయి. కలర్ గ్రేడింగ్, లైటింగ్ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్రిలియన్స్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఫస్టాఫ్ చాలా పేలవంగా సాగుతుంది అనుకొంటున్న తరుణంలో వచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ తర్వాత ప్రభుదేవ టిపికల్ క్యారెక్టరైజేషన్ & ఎబిలిటీస్ ను బేస్ చేసుకొని రాసుకొన్న స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా.. క్లైమాక్స్ ఎండింగ్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ సెటిమెంట్ & ఎమోషనల్ టచ్ ఇవ్వడం అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఒక దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా వైవిధ్యమైన కథ-కథనాలతో “మెర్క్యూరీ” చిత్రాన్ని తెరకెక్కించడమే కాక భావితరాలకు మంచి మెసేజ్ ఇవ్వడం అనేది అభినందనీయం.

విశ్లేషణ : “మెర్క్యూరీ” అనేది రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. అందువల్ల ఏదో ఎక్స్ పెక్ట్ చేసి పొరపాటున కూడా థియేటర్ కి వెళ్ళకండి. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే ఈ చిత్రాన్ని చూడండి. ప్రభుదేవ నటన, ప్రీక్లైమాక్స్ ఎమోషనల్ టచ్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే అంశాలు.

రేటింగ్ : ఇది ప్రయోగాత్మక చిత్రం గనుక రేటింగ్ ఇవ్వడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus