తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి అంథాలజీ “మెట్రో కథలు”. “పలాస” చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను ఘనంగా చాటుకున్న కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నాలుగు కథల సమాహారం ప్రముఖ రచయిత ఖదీర్ బాబు రచనల నుండి స్ఫూర్తి పొందినవి కావడం విశేషం. మరి ఈ అంథాలజీ ఎలా ఉంది అనేది చూద్దాం..!!
సో, ముందే చెప్పినట్లుగా ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ నాలుగు విభిన్నమైన కథలు, జీవితాలు. అందుకే కథ, నటీనటుల పనితీరు అని విడివిడిగా విశ్లేషించలేం కాబట్టి.. ఒక్కో కథగా చెప్పుకొందాం.
ప్రపోజల్: అభిరామి పాత్ర తో ఈ జనరేషన్ అమ్మాయిల నిజాయితీ, ముక్కుసూటి తనం కనిపిస్తుంది.. అనవసర మోహమాటలు, అక్కరకు రాని బిడియాలు వదిలేసి, తనతో జీవితాన్ని కోరుకున్న అబ్బాయికి తానేంటో నిజంగా పరిచయం చేసి నిర్ణయం అబ్బాయికే వదిలేస్తుంది. తిరువీర్ స్క్రీన్ ప్రజన్స్ బాగుంది.. నక్షత్ర చూడటానికి బాగుంది, చక్కగా నటించింది.
ఘటన: ఒంటరితనం.. దానితో వచ్చే అసహనం అది పెరిగితే వచ్చే కోపం.. వీటికి రూపం మంజుల ఆ పాత్రకు ప్రాణం ఇచ్చింది సనా. ఇప్పటి వరకూ సనా చేయని పాత్ర, సనా లో కనిపించని ఎమోషన్…మెట్రో కథ లు చూసిన వారికి సనా కొత్త గా కనిపిస్తుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర లు రాసుకునే వారికి సనా గుర్తుకు వస్తుంది.. ఒక ఘటన లో తన జీవితంలో ఏమి కోల్పోతుందో దర్శకుడు కరుణ కుమార్ చాలా సెన్సిబుల్ గా చెప్పాడు. అలిరాజ తన పాత్ర కు న్యాయం చేసాడు.
సెల్ఫీ: ప్రేమించి పెళ్లి చేసుకుంది. అదే ప్రేమ కోసం పక్క చూపులు చూడాల్సి వచ్చింది. కెరియర్ కోసం పెట్టె పెరుగులో ఏ కోల్పోతున్నామో సుప్రియ చెబుతుంది. నందిని రాయ్ లోని నటిని సుప్రియ పాత్ర తో పరిచయం చేశాడు కరుణ కుమార్. అపాత్ర లోని పెయిన్ ని తనదిగా చేసుకుంది నందిని రాయ్. ఈ కథ ఎండింగ్ కి వచ్చేసరికి గుండె బరువెక్కుతుంది. రామ్ ముద్దుకూరి పాత్రకు తగ్గట్టు గా ఉంటే.. నందిని రాయ్ ఆర్టిస్ట్ గా బలమైన ముద్ర వేసింది.
తేగలు: మన కిష్టమైన వాటిని రుచి తో గుర్తు పెట్టుకుంటాం… కానీ వాటి వెనుక ఉండే జ్ఞాపకాలను వదిలేస్తాం. వాటిని గుర్తు చేసాడు రాజీవ్ కనకాల నటనా ప్రతిభ కు తేగలు నిదర్శనం. భార్గవి చాలా చక్కగా నటించింది. ఈ తెగలు మనలోకి మనం చూసుకునే లా చేస్తాయి. మంచి ఫీల్ తో మెట్రో కథలను ముగించాడు దర్శకుడు కరుణ కుమార్.
విశ్లేషణ: తెలుగు సాహిత్యంలోని మరిన్ని కథలను చూసేందుకు మెట్రోకథలు ఒక రెఫరెన్స్ గా ఉపయోగపడతాయి. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఈ అంథాలజీ. 75 నిమిషాల ఈ చిన్న సిరీస్ ఎన్నో జీవితాలను పరిచయం చేస్తుంది.. మన దైనందిన జీవితంలోని చాలా మందిలోని కోణాలను ప్రస్ఫుటపరిచింది.
రేటింగ్: 2.5/5
ప్లాట్ ఫార్మ్: ఆహా యాప్