ఆయన చేసిన సినిమాలు తక్కువే కావొచ్చు.. కానీ చేసినంతవరకు తన ప్రత్యేకతను చూపించే పాటలు, నేపథ్య సంగీతాన్నే అందించారు. వరుస సినిమాలు చేసే రకం కూడా కాదాయన. ఇప్పుడు రోషన్ కనకాల – అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఛాంపియన్’ సినిమాకు ఆయనే సంగీతం అందించారు. తెలంగాణ జానపదానికి, పాశ్చాత్య సంగీతాన్ని మిక్స్ చేసి వినసొంపైన పాటలు అందించిన ఆ సంగీత దర్శకుడే మిక్కీ జె.మేయర్. ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు మిక్కీ. ఈ సందర్భంగానే రిటైర్మెంట్ టాపిక్ వచ్చింది.
క్లాస్ సినిమాలతోనే కెరీర్‌ని ప్రారంభించిన మిక్కీ జే మేయర్.. ఆ తర్వాత మాస్ సినిమాలకూ మ్యూజిక్ చేసి తనలో రెండు కోణాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు పీరియాడిక్ సినిమా ‘ఛాంపియన్’తో రాబోతున్నారు. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమా గురించి చెప్పండి అంటే.. పీరియాడిక్ సినిమాలంటే ఇష్టం. ఒక కాలాన్ని మరో కాలం నుండి చూడటం ఆసక్తికరమైన విషయం అని చెప్పారు. ‘మహానటి’ సినిమా తర్వాత ఆ అనుభూతిని ఈ సినిమా ఇచ్చింది అని చెప్పారు.
కెరీర్ గురించి ఈ సందర్భంగా ఓపెన్ అయ్యారు మిక్కీ జే మేయర్. నన్ను నేను నిరూపించుకునేందుకని ప్రత్యేకంగా ఏ సినిమా చేయను. నా దగ్గరకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ కథ జానర్‌కి తగ్గట్టుగా సంగీతం చేయాలని అనుకుంటాను. దానికి తగ్గట్టే సంగీతం అందిస్తాను. నేను సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. ఈ జర్నీలో దాదాపు యాభై సినిమాలు చేశాను. ఎన్నో మంచి పాటలు అందించాను. ఇంకో పది సినిమాలు చేస్తే ఇక రిటైర్ అయిపోవచ్చు అని నవ్వేశారు మిక్కీ.
కెరీర్‌లో పీక్స్‌లో ఉన్న సమయంలో ఇప్పుడు ఆయన నోట రిటైర్మెంట్ మాట ఎందుకొచ్చింది అనేదే ఇక్కడ ప్రశ్న. నిజంగానే రిటైర్ అవుతారా? లేక ఏదో ఫ్లోలో అన్నారా అనేది చూడాలి. అయితే వచ్చిన సినిమా వచ్చినట్లు చేసే రకం కాదాయన. కాబట్టి తక్కువ సినిమాలే చేశారు ఇప్పటివరకు కెరీర్‌లో.