ఆశ్చర్య పరుస్తున్న రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్

ధృవ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రీషూట్ జరుపుకుంటోంది. చరణ్ కి జోడిగా తొలిసారి సమంత నటిస్తున్న ఈ మూవీ ఫోటోలు ఆకట్టుకున్నాయి. అలాగే ఈ నెల 24న విడుదల కానున్న టీజర్ అంచనాలను పెంచుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఆ ధీమాకి ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ బలాన్ని చేకూర్చుతోంది. ఈ సినిమా థియేటర్స్ రైట్స్ సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. ట్రేడ్ వర్గాలవారు తెలిపిన దాని ప్రకారం ఈ సినిమా నైజాం, సీడెడ్ హక్కులు 30 కోట్ల మొత్తానికి అమ్ముడైనట్టు తెలిసింది. ఆంధ్ర థియేటర్స్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయి.

తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు సుమారు 20 కోట్లకు పైగానే అమ్ముడవగా, హిందీ శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ హిందీ ఛానెల్ 10.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే ఆడియో హక్కులు కూడా భారీగానే పలికాయి. 1.5 కోట్లకు ఓ మ్యూజిక్ కంపెనీ సొంతం చేసుకున్నట్టు టాక్. ఇప్పటికే బిజినెస్ 60 కోట్లు దాటిపోయింది. ఇంకా సినిమా రిలీజ్ కి రెండు నెలలు ఉంది. అప్పటి లోపున పూర్తి లెక్కలు రానున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ తదితరులు నటిస్తున్న ఈ సినిమా మార్చి 30 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus