పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్‌లో వరుస సినిమాలు నిర్మిస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ. గత కొన్నేళ్లుగా శరవేగంగా సినిమాలు ఓకే చేస్తూ, నిర్మిస్తూ, విడుదల చేస్తూ రాణిస్తోంది. అయితే సినిమాల ఫలితాల విషయంలో ఇటీవల కాలంలో ఆశించినట్లుగా లేదు. విజయాలు రాకపోవడం పక్కనపెడితే ఫ్లాప్‌లు బాగా వేధించేలా వసూళ్లు వచ్చాయి. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ల జోష్ గత కొన్ని నెలలుగా బాగా తగ్గుతూ వచ్చింది. అయితే ‘మిరాయ్’ సినిమాతో తిరిగి పుంజుకుంటాం అని మాత్రం చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే చేశారు. అంతేకాదు రాబోయే అతి పెద్ద సినిమా కోసం టీమ్‌కి కావాల్సినంత హై కూడా వచ్చింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ప్రస్తుతం 12 సినిమాలు సిద్ధమవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ – రాశీ ఖన్నా – శ్రీనిధి శెట్టి – నీరజ జోన సినిమా ‘తెలుసు కదా’ అక్టోబరులో వస్తుంది. రోషన్ – సందీప్ రాజ్ ‘మోగ్లీ’ కూడా పదో నెలలోనే వస్తుందట. ఇక అడివి శేష్ – వామికా గబ్బి ‘జీ 2’, ఆనంది ‘గరివిడి లక్ష్మి’, లావణ్య త్రిపాఠి సినిమా, సునీల్ సినిమా కూడా ఉన్నాయి అని తెలిపారు. వీటన్నింటి కంటే అతి పెద్ద సినిమా ప్రభాస్ – మారుతి ‘ది రాజాసాబ్’. ఈ సినిమా మీదనే పీపుల్ మీడియా భారీ ఆశలు పెట్టుకుంది. దానికే ఇప్పుడు హై వచ్చింది.
‘ది రాజా సాబ్’ సినిమా గురించి టీమ్ చాలా నెలలుగా గొప్పగా చెబుతూ వస్తోంది. అయితే సినిమా అప్‌డేట్‌లు లేకపోవడం, ప్రభాస్ వెంటవెంటనే డేట్స్ ఇవ్వకపోవడం, సినిమా విడుదల తేదీలు మారుతూ ఉండటం, చెప్పిన సీజన్‌కి రాకపోవడంతో సినిమా మీద అంచనాలు, ఆశలు తగ్గుతూ వచ్చాయి. కారణాలు తెలియదు కానీ సినిమా ఓటీటీ డీల్ కూడా కాలేదు అని వార్తలొచ్చాయి. ఆ సమయంలో ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి మొత్తం ఆసక్తిని తిరిగి తీసుకొచ్చేశారు, సినిమా మీద అంచనాలు పెంచారు.
ఈ సమయంలో సినిమా నిర్మాణ సంస్థకు సరైన విజయం దక్కితే తిరిగి ట్రాక్ ఎక్కేస్తారు. ‘ది రాజాసాబ్’ సినిమాను ఇంకాస్త బాగా ప్రమోట్ చేస్తారు అని అనుకున్నారంతా. ఇప్పుడు ‘మిరాయ్’ సినిమా సాధించిన విజయం, ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌కి వచ్చిన పేరు ఇప్పుడు పీపుల్ మీడియాను ఫుల్ హైలోకి తీసుకొచ్చింది. ‘ది రాజా సాబ్’ సినిమా నుండి ఇంకా చాలా ఆశించొచ్చు అని నిరూపించింది.