సినిమా ట్రైలర్ చూడగానే హిట్ కళ కనిపించడం చాలా అరుదు. పెద్ద హీరోల సినిమాలకు ఈ ఫీల్ ఆటోమేటిగ్గా రావొచ్చు. అయితే చిన్న సినిమాలకు మాత్రం హిట్ కళ అంత ఈజీగా కనిపించదు, అనిపించదు. ఇటీవల కాలంలో అలాంటి ఫీల్ ఫస్ట్‌లుక్‌లో తీసుకొచ్చిన సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. తాప్సి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో తన ఫన్ స్టామినాను చూపించిన స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో రూపొందిన సినమా ఇది.
ముగ్గురు చురుకైన పిల్లలు కలసి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని రూ. యాభై లక్షలు సంపాదించాలని అనుకుంటారు. ఈ క్రమంలో వారేం చేశారు, ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు, వాటి నుండి ఎలా భయపడ్డారు అనేదే ఈ సినిమా ప్రధాన కథ. అయితే దీనికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తాప్సీ చేపట్టిన మరో మిషన్ యాడ్ ఆన్ కథ. ఈ రెండింటినీ కలుపుతూ దర్శకుడు ఈ సినిమా కథను సిద్ధం చేసుకొన్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
వినడానికి ఈ పాయింట్ చాలా ఈజీగా, చిన్నగా అనిపిస్తోంది కానీ… సినిమాలో ప్రధాన పాత్రధారులైన ముగ్గురు పిల్లల మధ్య ఫన్, పేలిన డైలాగ్‌లు సినిమా మీద హైప్‌ను అమాంతం పెంచేశాయి అని చెప్పొచ్చు. హిట్ సినిమాల రిఫరెన్స్‌ను సినిమాలో చక్కగా వాడుకున్నారు. అలాగే ‘ఆర్‌ఆర్ఆర్’, ‘కేజీయఫ్’ రిఫరెన్స్‌ను కూడా చూపించేసరికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఆర్జీవీ ఫొటో అనుకొని దావూద్ ఇబ్రహీం ఫొటో దాచుకున్నా అనే డైలాగ్ భలేగా అనిపిస్తుంది.
అలాగే మిషన్ త్రివిక్రమ్, ‘దావూద్ ఇంటికి దారేది’, ‘ఆర్ఆర్ఆర్’ అంటే రఘుపతి .. రాఘవ.. రాజారాం, ‘కేజీయఫ్’ అంటే.. వన్ నా టూ అని అడగడం లాంటి పంచ్‌లు ట్రైలర్‌లోలో అదిరిపోయాయి. వీటితోపాటు ‘‘దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే రూ.50లక్షలు ఇస్తారట. ఆ డబ్బులు తీసుకెళ్లి రాజమౌళికి ఇస్తే ‘బాహుబలి 3’ తీస్తాడు’’ డైలాగ్ కూడా అదిరిపోయింది. ఇక సినిమా విడుదల సంగతికొస్తే… నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. మలయాళీ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. దీపక్ యరగర ఛాయాగ్రాహకుడు కాగా, రవితేజ గిరిజల ఎడిటర్.