గతేడాది “చిన్నా”తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ (Siddharth) ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు హీరోగా తెరకెక్కిన “మిస్ యు” (Miss You) సినిమా విడుదలవ్వడం జరిగింది. ఈ సినిమా కంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జేసేబీలు కనిపిస్తే వస్తారు జనాలు అంటూ సిద్ధార్థ్ చేసిన స్టేట్మెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. తమిళంలో తెరకెక్కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ గా విడుదలైన “మిస్ యు” (Miss You) సిద్ధార్థ్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: దర్శకుడు అవ్వాలనే ధ్యేయంతో కథలు రాసుకుంటూ తిరిగే యువకుడు వాసు (సిద్ధార్థ్), సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పెద్దగా బాధ్యతలు లేకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే.. ఓ యాక్సిడెంట్ లో గతం మొత్తం మర్చిపోయి, కొత్త జీవితం మొదలెడుతూ బెంగళూరు వెళతాడు. అక్కడ సుబ్బలక్ష్మి (ఆషిక రంగనాథ్)ను (Ashika Ranganath) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
కానీ సుబ్బలక్ష్మి మాత్రం వాసుని అస్సలు పట్టించుకోదు, ఆఖరికి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసినా తిరస్కరిస్తుంది. ఆమె ఎందుకు అలా చేసింది అని ఆలోచిస్తున్న వాసుకి సుబ్బలక్ష్మి గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు సుబ్బలక్ష్మి ఎవరు? వాసుని ఎందుకని అవాయిడ్ చేస్తుంది? సుబ్బలక్ష్మి గురించి వాసు తెలుసుకున్న షాకింగ్ విషయం ఏమిటి? వంటి విషయాలకు సమాధానమే “మిస్ యు”(Miss You).
నటీనటుల పనితీరు: ఈ సినిమాలో సిద్ధార్థ్ కంటే ఆషిక రంగనాథ్ ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. మనసులో బాధను అదిమిపెట్టుకున్న భగ్న ప్రేమికురాలిగా ఆమె నటన ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తుంది. సిద్ధార్థ్ చాలా రెగ్యులర్ గా కనిపించాడు. యాక్షన్ బ్లాక్స్ తో మెప్పించడానికి ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కరుణాకర్ కామెడీ పంచ్ లు బాగానే పేలాయి. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఓ మోస్తరుగా అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: జిబ్రాన్ (Ghibran Vaibodha) నేపథ్య సంగీతం బాగుంది. పాటల తెలుగు సాహిత్యం మాత్రం అస్సలు సింక్ అవ్వలేదు. వెంకటేష్ (K.G. Venkatesh) సినిమాటోగ్రఫీ వర్క్ డిసెంట్ గా ఉంది. అయితే.. సినిమా మొత్తాన్ని ఓ గేటెడ్ కమ్యూనిటీలో చుట్టేయడంతో చాలా సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఆ విషయంలో సినిమాటోగ్రఫీ టీమ్ జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.
దర్శకుడు ఎన్.రాజశేఖర్ (N. Rajasekar) ఈ సినిమా కథను “డెఫినెట్లీ, మే బీ” (2008) నుంచి స్ఫూర్తి పొందడం వరకు బాగానే ఉంది కానీ.. ఇదే తరహా కథతో గతేడాది తెలుగులో ఒక సూపర్ హిట్ సినిమా వచ్చిందనే విషయాన్ని గమనించకపోవడం గమనార్హం. ఎందుకంటే.. ఆల్రెడీ ఒకసారి చూసేసిన కథను ప్రేక్షకులు మళ్లీ ఏడాది లోపే చూస్తారని ఎలా అనుకున్నారో మేకర్స్ కే తెలియాలి. సినిమా మొత్తంలో సినిమాటోగ్రఫీ వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ తప్ప రైటింగ్ & డైరెక్షన్ విషయంలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ విషయం కూడా లేదు. డైలాగ్స్ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేవు.
విశ్లేషణ: ఎమోషనల్ సినిమాలు ఆడియన్స్ ను అలరించాలంటే.. కథలో ఎమోషన్ తోపాటు ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే పాయింట్ కూడా ఉండాలి. “మిస్ యు”లో (Miss You) అది మిస్ అయ్యింది. అందువల్ల సినిమా మొత్తం డ్రామా నడుస్తున్నా ఆడియన్స్ ఎవరూ కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మినహా చెప్పుకోదగ్గ పాయింట్ కూడా లేదు సినిమాలో. ఇలాంటి యావరేజ్ సినిమాలతో థియేటర్లకి రావడమే పెద్ద రిస్క్ అనుకుంటే.. వేరే హీరోల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల సిద్ధార్థ్ కెరీర్ ఇంకాస్త డౌన్ అవ్వడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.
ఫోకస్ పాయింట్: మళ్లీ మిస్ అయ్యావ్ సిద్ధార్థ్!
రేటింగ్: 1.5/5