Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!
- September 18, 2026 / 06:10 PM ISTByPhani Kumar
Cast & Crew
- రామ్ కార్తీక్ (Hero)
- అమ్ము అభిరామి (Heroine)
- వైదిక సెంజాలియా, గోపరాజు రమణ, అంకిత్ కొయ్య తదితరులు (Cast)
- వాచస్పతి (Director)
- నరేష్ బాబు పంచమురాతి (Producer)
- ఆర్ ఆర్ ధృవన్ (Music)
- శ్యామ్ కె నాయుడు (Cinematography)
- బసవ (Editor)
- Release Date : సెప్టెంబర్ 18 2026
- 'ఫస్ట్ కాపీ మూవీస్' (Banner)
ప్రభాస్- మారుతీ కలయికలో వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ప్రభాస్ నానమ్మ(యంగర్ రోల్) పాత్ర పోషించిన అమ్ము అభిరామిని కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మిస్సింగ్ మేఘన’ అనే థ్రిల్లర్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
Missing Meghana Review

కథ : మేఘన అలియాస్ మేఘ (అమ్ము అభిరామి) పుట్టగానే తల్లిని పోగొట్టుకుంటుంది. అప్పటినుంచి ఆమెకు అన్నీ తానై పెంచుతాడు తండ్రి (గోపరాజు రమణ). పెళ్లీడుకొచ్చినప్పటికీ సొంత కాళ్లపై నిలబడేవరకు ఆ ప్రస్తావన తేవొద్దని తండ్రికి తెగేసి చెబుతుంది మేఘ. ఆ తర్వాత స్నేహితుడు ఆకాష్ (అంకిత్ కొయ్య) సలహా మేరకు ఓ బేకరీ పెట్టుకుంటుంది. అనుకోకుండా ఆమె ఓ రోజు కిడ్నాప్‌కు గురవుతుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు మేఘ తండ్రి. అయితే వాళ్లు కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించడంతో ఏసీపీ అర్జున్‌కు ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత అర్జున్ ఎంట్రీ ఇచ్చి.. కిడ్నాప్ అయ్యే ముందు మేఘతో గొడవలు పెట్టుకున్న వారందరినీ విచారిస్తాడు. ఈ క్రమంలో కార్తీక్ (రామ్ కార్తీక్) అనే ర్యాపిడో డ్రైవర్ కూడా మేఘ కిడ్నాప్ అవ్వడానికి కారణమని గుర్తిస్తాడు. అసలు మేఘకు, కార్తీక్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? కార్తీక్ గతం ఏంటి? చివరికి మేఘన ప్రాణాలతో బయటపడిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు : అమ్ము అభిరామి చేసింది టైటిల్ రోల్ అయినప్పటికీ.. కనిపించింది మాత్రం తక్కువ సేపే. ఆమె పెర్ఫార్మన్స్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. బాగానే చేసింది. కానీ లుక్స్ మాత్రం తేడా కొట్టాయి. కొన్ని సన్నివేశాల్లో బొద్దుగా కనిపించింది. మరికొన్ని సన్నివేశాల్లో లీన్ గా అనిపించింది. రామ్ కార్తీక్ ఎప్పటిలానే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో లాంగించేశాడు. యాక్షన్ సన్నివేశాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అంకిత్ కొయ్య మాత్రం డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ ఈ పాత్రని దర్శకుడు ఇంకాస్త బాగా డిజైన్ చేసి ఉండాల్సింది. మిగతా పాత్రలు చెప్పుకునే రేంజ్లో లేవు.

సాంకేతిక నిపుణుల పనితీరు : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఆ జోనర్‌ని ఇష్టపడే ఆడియన్స్ దానికి ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కానీ ఇలాంటి సినిమాలు తీయడం అనేది అంత ఈజీ కాదు. కత్తి మీద సాము వంటిది. లెక్కలేనన్ని చిక్కుముడులు వేయాలి. రైటింగ్ కరెక్ట్‌గా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా ఫలితం మారిపోతుంది. ఈ మధ్య ఆడియన్స్ కూడా సినిమాని బాగా తెలివిగా చూస్తున్నారు. ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందనేది చాలా శ్రద్దగా గమనిస్తున్నారు. ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండబోతోందో అంచనా వేసేస్తున్నారు. అలాంటిది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల విషయానికి వస్తే.. ‘విలన్ ఎవరనేది’ అంచనా వేయడంపై మొదటి నుంచీ ఓ కన్నేసుకుని కూర్చుంటున్నారు. అలాంటప్పుడు స్క్రీన్‌ప్లేని ఏ రేంజ్‌లో డిజైన్ చేసుకోవాలో ఆలోచించండి. జనాలని టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కనుక చేస్తే.. ఖచ్చితంగా అవి ‘మిస్సింగ్ మేఘన’ లానే ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా స్టార్ట్ అయిన అరగంటకే విలన్ ఎవరనేది ఆడియన్స్ పసిగట్టేస్తారు. కానీ ‘అంకుల్‌కి బదులు బాబాయ్’ అనే పదం పెట్టి డైవర్ట్ చేయాలని చూశాడు దర్శకుడు. కానీ ఆ పప్పులు ఉడకలేదు. రివీల్ చేసినప్పుడు అది ఏమాత్రం కన్వెన్సింగ్ గా అనిపించలేదు. పోనీ విలన్ ట్రాక్ రివీల్ అయ్యే వరకు హీరో, హీరోయిన్ల బ్యాక్ స్టోరీస్ గొప్పగా ఉన్నాయా? అంటే అదీ లేదు. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ చాలా సిల్లీగా ఉంది. సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో పాటలు ఉంటే ఆడియన్స్ మూడ్ డీవియేట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో పాటలే కొంత రిలీఫ్ ఇచ్చాయన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి, ఇట్టే ఎక్కేస్తాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం తేలిపోయింది. అసలు తెరపై వచ్చే సన్నివేశానికి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి సంబంధమే ఉండదు. బహుశా మ్యూజిక్ డైరెక్టర్ కి టీమ్ సరిపోలేదో? లేక నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ టీమ్‌కి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదో? వాళ్ళకే తెలియాలి. సో నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రన్‌టైమ్ 2 గంటలే ఉన్నా, ఎక్కువ సేపే థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది.

విశ్లేషణ : థ్రిల్లర్ సినిమాలు ఎలా తీయకూడదో చెప్పడానికి ‘మిస్సింగ్ మేఘన’ సినిమా బెస్ట్ ఎగ్జామ్పుల్ అని చెప్పాలి. ఫస్ట్ సీన్ నుండీ చాలా బోరింగ్ గా నడుస్తుంది ఈ సినిమా కథనం. ఓటీటీల్లోకి వచ్చాక కూడా ఫాస్ట్ ఫార్వార్డ్ బటన్ వాడకుండా ఈ సినిమాని చూడటం చాలా కష్టం
ఫోకస్ పాయింట్ : బోరింగ్ థ్రిల్లర్
రేటింగ్ : 1/5













