“లిటిల్ హార్ట్స్” సూపర్ హిట్ తర్వాత బన్నీ వాసు సారథ్యంలో విడుదలైన తాజా చిత్రం “మిత్ర మండలి”. బడ్డీ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో పాపులర్ కమెడియన్స్ అందరూ ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: సినిమా ఆరంభంలోనే కథ లేని కథ అని వాయిస్ ఓవర్ వస్తుంది. మేకర్స్ కూడా చెబుతూనే ఉన్నారు కథ కోసం సినిమాకి రాకండి అని. అయినప్పటికీ ఈ సబ్ హెడ్డింగ్ కి న్యాయం చేయడం కోసం సింగిల్ పాయింట్ స్టోరీ లైన్ ఏంటంటే.. జంగ్లీపట్నం అనే ఊర్లో, పెద్దగా చెప్పుకోదగ్గ పనేమీ లేని నలుగురు స్నేహితులు (ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా), ఆ నగరంలోని అగ్ర కుల పెద్ద అయిన నారాయణ (విటివి గణేష్) కూతురు స్వేచ్ఛ (నిహారిక ఎన్.ఏం) కారణంగా ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు.
ఏమిటా సమస్య? అందులో నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు? అనేది “మిత్ర మండలి” కథాంశం.
నటీనటుల పనితీరు: ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోని టాప్ కమెడియన్స్ అందరూ సినిమాలో ఉన్నారు. కానీ సత్య తప్ప ఎవ్వరూ కనీస స్థాయిలో నవ్వించలేకపోయారు అని చెప్తే విడ్డూరంగా ఉంటుంది కానీ.. అదే జరిగింది.
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్ లాంటి సీజన్డ్ కమెడియన్స్ తెరపై ఉన్నా ప్రేక్షకులకు నవ్వే అవకాశం రాలేదు. అయితే అది డైలాగులు పేలకపోవడం వల్ల కాదు, క్యారెక్టర్స్ వర్కవుట్ అవ్వకపోవడం వల్ల.
నిహారిక హీరోయిన్ గా లాంచ్ అనుకున్నప్పుడు లుక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఒక్క ఇంట్రడక్షన్ సీన్ తప్పితే, మరే ఇతర సన్నివేశంలోనూ ఆమె ఆకట్టుకోలేకపోయింది.
సత్య ఒక్కడు మాత్రం ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ మధ్య వచ్చి కథనాన్ని వేగవంతం చేయడమే కాక ప్రేక్షకుడికి నవ్వుని గుర్తు చేసి వెళ్లిపోతుంటాడు.
విటివి గణేష్, జీవన్ తదితరుల కామెడీ టైమింగ్ కూడా సన్నివేశాల్లో పట్టు లేకపోవడం వల్ల వర్కవుట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు విజయేందర్ పనితనం గురించి ముందుగా మాట్లాడుకోవాలి. అతను రాసుకున్న సన్నివేశంలో హాస్యానికి ఆస్కారం ఉంది. కానీ.. సదరు సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానంతోనే అసలు సమస్య. ఒక కామెడీ సీన్ ని రాయడం కంటే, అది సరిగ్గా ల్యాండ్ అయ్యి, ఆడియన్స్ రిలేట్ అయ్యి, సదరు సన్నివేశం లేదా సంభాషణను ఆస్వాదించడం అనేది చాలా కీలకం. ఆ విషయంలో మాత్రం విజయేందర్ విఫలమయ్యాడు. అలాగని అతడి రాతలో విషయం లేదా అంటే కాదు.. ప్రస్తుత సమాజంలోని చాలా అంశాలకు వ్యంగ్యంగా కౌంటర్ వేసాడు. అది సోషల్ మీడియాకి యువత దాసోహం అవ్వడం కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ప్రెజర్ కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులను గుడ్డిగా నమ్మి, ఫాలో అయ్యే కార్యకర్తల మైండ్ సెట్స్ కావచ్చు.. ఇలా చాలా అంశాల మీద మంచి సెటైర్లు ఉన్నాయి.
కానీ.. ఆ సెటైర్లు సరిగా పేలలేదు. ఒక సెటైర్ అనేది ఆడియన్స్ అర్థం చేసుకోవడానికంటే ముందు నవ్వాలి. అది ఇక్కడ జరగలేదు. మరీ ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టేసుకోవడం వల్ల దర్శకుడు వాళ్లందరినీ హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడి కథనాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడం అనే అంశాన్ని పక్కన పెట్టేశాడా? అనే అనుమానం రాక మానదు. ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం.. మిత్రమండలి వర్కవుట్ అవ్వకపోవడానికి హోల్ & సోలో రీజన్ మాత్రం విజయేందర్ అనే చెప్పాలి.
ఆర్.ఆర్.ధృవన్ తన సంగీతంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే అదంతా జబర్దస్త్ లో పేలని స్కిట్ కి నవ్వండి అని మ్యూజిక్ వేసినట్లు అయిపోయింది. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ పరిస్థితి కూడా అంతే. అయితే.. చాలా షాట్స్ లో గ్రీన్ మ్యాట్ సీక్వెన్సులు దొరికిపోతాయి. అలాగే.. డి.ఐ కొన్ని సీన్స్ లో మరీ ఎక్కువ బ్రైట్ అయిపోయింది. అది నటీనటుల లుక్స్ ను కూడా డ్యామేజ్ చేసింది.
ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ మిక్సింగ్, కాస్ట్యూమ్స్ వంటి డిపార్ట్మెంట్స్ మాత్రం తమ 100% ఎఫర్ట్స్ పెట్టారు.
విశ్లేషణ: ప్రేక్షకులను ఇలాగే నవ్వించాలి, ఈ విధంగానే కామెడీ ల్యాండ్ అవుతుంది అనే రూల్ బుక్ ఏమీ లేదు. ఒక్కోసారి ఏమాత్రం ఊహించని విధంగా కామెడీ వర్కవుట్ అయ్యి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. రాసే సన్నివేశంలో, నటీనటులు పలికే సంభాషణల్లో మాత్రమే కాదు.. సదరు సందర్భం కూడా ప్రేక్షకులకు నచ్చాలి, అన్నీ కలగలిపి నవ్వించాలి. “మిత్ర మండలి” విషయంలో అదే కొరవడింది. దర్శకుడు, రచయిత విజయేందర్ రాసుకున్న సన్నివేశాల్లో వ్యంగం ఉంది కానీ.. హాస్యం లేదు. నలుగురు నిర్మాతలు, 20 మంది కమెడియన్లు, లెక్కకి మిక్కిలి టెక్నీషియన్ల కష్టం ఈ విధంగా వృధా అవ్వడం మాత్రం బాధాకరం.
ఫోకస్ పాయింట్: మెప్పించలేకపోయిన మిత్రమండలి!
రేటింగ్: 2/5