Modern Masters SS Rajamouli Review in Telugu: మోడ్రన్ మాస్టర్స్: ఎస్.ఎస్.రాజమౌళి డాక్యుమెంటరీ రివ్యూ.!

ఒక ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్, అది కూడా తెలుగు వాడి గురించి నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ ఒక డాక్యుమెంటరీ చేయడం, అందులో హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడైన జేమ్స్ కామరూన్, జోయ్ రుస్సో తమ అభిప్రాయాల్ని పంచుకోవడం తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన విషయం. రాఘవ్ ఖన్నా దర్శకత్వంలో రాజమౌళి జీవితాన్ని, ఆయన పుట్టుపూర్వోత్తరాలను, కష్టాలను, ఎదుగుదలను, ధ్యేయాన్ని ప్రపంచానికి పూర్తిస్థాయిలో పరిచయం చేసిన డాక్యుమెంటరీ “మోడ్రన్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి”.

ప్రముఖ పాత్రికేయురాలు, సినీ విశ్లేషకురాలు అనుపమ చోప్రా షో రన్నర్ గా రూపొందిన ఈ డాక్యుమెంటరీకి రాఘవ్ ఖన్నా దర్శకుడు.

బేసిగ్గా ఈ డాక్యుమెంటరీ రాజమౌళి మినీ బయోగ్రఫీ లాంటిది. యవ్వనంలో తాను పడిన కష్టాలు మొదలుకొని.. ప్రస్తుతం తాను ఆస్వాదిస్తున్న ప్రపంచ ప్రఖ్యాతి గూర్చి స్వయంగా రాజమౌళి చెప్పిన కొన్ని విశేషాలు, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన ఫిల్మ్ మేకింగ్ లో భాగస్వాములు అయిన విజయేంద్రప్రసాద్, రమారాజమౌళి, కీరవాణి మరియు ఆయన సినిమాల్లో ఎక్కువసార్లు నటించిన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లు చెప్పుకొచ్చిన సందర్భాలు మరియు అనుభవాల సమాహారమే ఈ డాక్యుమెంటరీ.

రాజమౌళి కుటుంబం సినిమాల ప్రస్థానం ఎప్పడు మొదలైంది, ఎక్కడ తడబడింది వంటి కీలకమైన విషయాలను స్వయంగా వారే వెల్లడించడం విశేషం. అలాగే.. రాజమౌళి ఎంత మంచి భర్త అనే విషయాన్ని ప్రభాస్ వివరిస్తూ ఒకరోజు షూటింగ్ లేట్ అయ్యేసరికి ఇంటికి వెళ్లేసరికి 11 అవ్వగా.. రమారాజమౌళిని నిద్రలేపడం ఇష్టం లేని రాజమౌళి వరండాలో రాత్రి మొత్తం పడుకోవడం అనే సందర్భం భలే ముద్దుగా ఉండగా.. రాజమౌళి పనిరాక్షసుడు అని అందరూ ప్రేమతో తిట్టిన తీరు ఆయన నిబద్ధతను అందరికీ అర్థమయ్యేలా చేసింది. అదే విధంగా.. రాజమౌళి ఫ్యామిలీ ట్రిప్స్ లో ఓ మిడిల్ క్లాస్ తండ్రిగా వ్యవహరించే తీరు వింటే ముచ్చటేసింది.

అలాగే.. “బాహుబలి” నిర్మాణ సమయంలో మహాబలేశ్వర్ లొకేషన్ లో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం కోసం రాజమౌళి ఒక లాడ్జ్ లో ఉండడం, టీమ్ మొత్తం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినడం, రాజమౌళి కుటుంబ సభ్యులు, పిల్లలతో సహా సెట్స్ లోన్ గడపడం వంటి విషయాలు విని, చూసే కొద్దీ రాజమౌళి మీద ఉన్న గౌరవం మరింత పెరుగుతుంది.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రానాలు రాజమౌళితో తమ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి షేర్ చేసుకున్న విషయాలన్నీ భలే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ 74 నిమిషాల డాక్యుమెంటరీలో బోలెడన్ని విషయాలు, విశేషాలు ఉన్నాయి.

రాజమౌళి అభిమానులు మాత్రమే కాదు, సినిమా మీద ప్యాషన్, సినిమాల్లోకి రావాలనుకుంటున్న యువత అందరూ చూసి ఉత్తేజితులవ్వాల్సిన డాక్యుమెంటరీ ఇది.

దర్శకుడు రాఘవ్ ఖన్నా, ప్రొడ్యూసర్ అనుపమ చోప్రా ఈ డాక్యుమెంటరీని బోరింగ్ గా కాకుండా.. ఇప్పటివరకు చాలామంది చూడని విజువల్స్ తో నింపి, రాజమౌళి పాయింటాఫ్ వ్యూ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పాయింటాఫ్ వ్యూస్ ను ప్రెజెంట్ చేసిన తీరు అభినందనీయం.

ఫోకస్ పాయింట్: నవతరం ఫిల్మ్ మేకర్స్ కి మాస్టర్ క్లాస్ ఈ “మోడ్రన్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి”.

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus