డైలాగ్ కింగ్ మోహన్ బాబు సినిమాలోనే కాదు.. నిజజీవితంలోనూ ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఎంత వారైనా సరే భయపడకుండా ఉన్నదీ ఉన్నట్టు అడిగేస్తారు. రీసెంట్ గా రాజకీయాలపైన ట్వీట్స్ చేసి ఆలోచింపచేశారు. ఈ రోజు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మనసులోని మాటను బయటపెట్టారు. దాసరి జయంతి దర్శకుల దినోత్సవంగా మారిన సందర్భంగా శుభాకాంక్షలతో.. దాసరిపై తనకున్న అభిమానాన్ని అక్షరాల రూపంలో తెలిపారు. ‘‘నాకు జన్మనిచ్చిన తండ్రి ఒకరైతే, నటుడిగా జన్మనిచ్చిన తండ్రి శ్రీ దాసరి నారాయణరావు గారు. ఆయన నాకు నటనలో ఓనమాలు నేర్పిన గురువు.” అని గురువుపై ఉన్న భక్తిని చాటారు. ఇంకా ఏమి రాశారంటే.. “చరిత్రనే తిరగరాసిన మహా దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.
ఆయన ఆశీర్వచనంతో తెలుగు పరిశ్రమలో 24 శాఖలలో ఎంతో మందిని గొప్పవారిగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకులైన నా గురువుగారు మరణించారు అంటే ఆ పదమే నాకు బాధాకరమైన పదం. ఆయన బతికే ఉన్నారు. కలకాలం బతికే ఉంటారు. మన మధ్యనే తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగుతూ ఉంటారు. నాకు వారానికి ఎన్నిసార్లు కలలోకి వస్తారో చెబితే అతిశయోక్తిగా ఉంటుంది. ఆయన మా ఇంటి పెద్ద. అటువంటి మా గురువుగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతిక్షణం కోరుకుంటూ ఆయన ఎక్కడున్నా మా ఇంటికి ఆశీర్వచనాలు ఇస్తూ వెన్నుదన్నుగా ఉంటారని కోరుకుంటున్నాను’’ అని మోహన్ బాబు భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అతని ట్వీట్ ని ఎంతోఅమంది లైక్ చేశారు. దాసరి గొప్పతనాన్ని మరోమారు గుర్తుకు తెచ్చుకున్నారు.