వెర్సటైల్ యాక్టర్ అని ఎప్పుడంటారు? ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలిగేవారిని, చేసి మెప్పించేవారిని ఆ మాట అంటారు. ఇందులో హీరో పాత్ర ఉంటుంది, విలన్ పాత్ర కూడా ఉంటుంది, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కూడా ఉంటుంది. ఇలాంటివాళ్లు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు. హీరోగా చేసి విలన్‌గా మారాక మళ్లీ తిరిగి రాని వారే ఎక్కువ. అయితే కొందరు మాత్రం ఇటు హీరోగా, అటు విన్‌గా చేస్తున్నారు, మెప్పిస్తున్నారు.
ఈ లిస్ట్‌లోకి ఇటీవల ‘కూలీ’ సినిమాతో నాగార్జున వచ్చి చేరారు. ఇతర పరిశ్రమల్లో అయితే తక్కువ. మలయాళ సినిమా పరిశ్రమ నుండి హీరోలు ఇలాంటి పని చాలా చేస్తున్నారు. ఇప్పుడు మోహన్‌లాల్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని సమాచారం. పెద్ద మనిషిగా సమాజంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత విలన్‌గా మారిన ఓ బిజినెస్ పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమా నిజ జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ‘దోశ కింగ్’ అనే తమిళ సినిమా ఒకటి అనౌన్స్ అయింది గుర్తుందా? తమిళనాడులో ప్రముఖ వ్యాపారవేత్త పి.రాజగోపాల్ పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు అని సమాచారం. తమిళనాడులోనే కాదు దేశంలో అనేక ప్రాంతాల్లో శరవణ భవన్ అనే హోటల్స్ పెట్టి ప్రముఖ వ్యాపార వేత్తగా పేరుగాంచిన రాజగోపాల్ ఓ హత్య కేసులో దోషిగా తేలారు. ఆయనకు శిక్ష ఖరారు అయిన కొద్ది రోజులకే మరణించారు. ఆయన కథతోనే ఇప్పుడు ఓ సినిమా రెడీ అవుతోంది.
‘జై భీమ్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక కథ విషయానికొస్తే.. తన జాతకం ప్రకారం జీవజ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాజగోపాల్ అనుకుంటారు. దీని కోసం ఆమె భర్తను హతమారుస్తారు. ఈ నేపథ్యంలో జీవజ్యోతి చేసిన న్యాయపోరాటమే సినిమా అని సమాచారం.