‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) అంటూ త్వరలో వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు మోహన్‌లాల్ (Mohanlal) , పృథ్వీరాజ్ సుకుమాన్ (Prithviraj Sukumaran) . గతంలో వచ్చిన ‘లూసిఫర్’ సినిమాకు ఇది సీక్వెల్. మరో భాగంగా కూడా ఉంది. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు. తొలి భాగం మిస్ అయిన ఆపర్చునిటీని ఈసారి క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు.
అలా హైదరాబాద్ వచ్చిన ‘ఎల్ 2: ఎంపురాన్’ టీమ్ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ క్రమంలో మోహన్‌లాల్ టాలీవుడ్ గురించి, సినిమా నిర్మాణం గురించి, మలయాళ సినిమా పరిశ్రమలో విజయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళం నుండి భారీ బడ్జెట్ సినిమాలు తక్కువగా వస్తున్నాయని, వాటిలో కొన్ని మాత్రమే ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి అని అడిగితే.. బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు కదా అని అన్నారు.
అలాగే భారీ బడ్జెట్ సినిమానా, చిన్న సినిమానా అని తాను ఎప్పుడూ చూడలేదని, మంచి సినిమానా కాదా అనేదే చూస్తానని చెప్పారు. ఈ సినిమా బడ్జెట్ ఇంత అని తాము చెప్పలేదని, కానీ విడుదలైన తర్వాత అసలు బడ్జెట్ కంటే మీరు ఎక్కువే అంచనా వేస్తారని చెప్పారాయన. అంతేకాదు సినిమా బడ్జెట్‌ను దర్శక నిర్మాతలు నిర్ణయించరని, కంటెంట్ ఆధారంగా బడ్జెట్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు మోహన్ లాల్.
టాలీవుడ్ దేశంలోనే బెస్ట్ అని, ఇక్కడి నటీనటులను ప్రేక్షకులు గౌరవించే విధానం బాగుంటుందని చెప్పారు. తన 47 ఏళ్ల కెరీర్‌లో ఎంతోమంది తెలుగు నటీనటులతో పనిచేసే అవకాశం లభించిందని.. దిగ్గజ నటుడు నాగేశ్వరరావుతో నటించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. తెలుగులో మరో సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన మోహన్‌లాల్.. రామ్ (Ram) సినిమాలో నటించే విషయం ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు. రామ్ కొత్త సినిమాలో లాలెటన్ ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.