సినీ పరిశ్రమలో జయాపజయాలు సహజం. ఎంత పెద్ద స్టార్ హీరోకైనా ఒక్కోసారి పరాజయం తప్పదు. కానీ పాన్ ఇండియా స్థాయిలో, భారీ అంచనాల మధ్య విడుదలైన ఒక సూపర్ స్టార్ సినిమా కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తేలేకపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజా చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫలితం చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అయ్యాయి. అసలు ఏం జరిగిందో తెలియక అభిమానులు అయోమయంలో పడిపోయారు.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘వృషభ’ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ థియేటర్లలో సినిమా విడుదలయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడిలో కనీసం 3 శాతం కూడా రికవరీ కాలేదని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.
ఈ డిజాస్టర్ కు ప్రధాన కారణం నాసిరకం కంటెంట్ అని విశ్లేషకులు అంటున్నారు. పాన్ ఇండియా సినిమా అని చెప్పి, వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడటం, కథనంలో పట్టు లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఇటీవలే ‘ఎంపురాన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ లాల్, వెంటనే ఇంతటి ప్లాప్ ను మూటగట్టుకోవడం ఎవరూ ఊహించని పరిణామం. అసలు ఈ సినిమా థియేటర్లలో ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది.
ఇక ఈ సినిమా ఫలితం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే, మోహన్ లాల్ జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది. సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఆయన మాతృమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్లిష్ట సమయంలో ఆయనకు అండగా నిలవడానికి అభిమానులు, సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. పరాజయాలు ఆయనకు కొత్త కాదు కాబట్టి, మళ్ళీ తనదైన శైలిలో బౌన్స్ బ్యాక్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.