తెలుగు-తమిళ చిత్రసీమల్లో ఒన్నాఫ్ ది మోస్ట్ సీనియర్ హీరోయిన్ అయిన త్రిష టైటిల్ పాత్రలో రూపొందిన తాజా చిత్రం “మోహిని”. “నాయకి” అనంతరం త్రిష నటించిన హారర్ కామెడీ చిత్రమిది. మాదేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కొన్నాళ్లుగా విడుదలకు ఇబ్బంది పడుతూ ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూలై 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హారర్ కామెడీ ఎలా ఉందో చూద్దాం..!!
కథ : వైష్ణవి (త్రిష) ఇండియాలోనే ఒన్నాఫ్ ది ఫైనెస్ట్ కేక్ బేకర్. ఆమె కేక్ మేకింగ్ వీడియోస్ కి మంచి ఫ్యాన్ బేస్ తోపాటు భారీ క్రేజ్ కూడా ఉంటుంది. అయితే.. లండన్ లో తన స్నేహితుడు కాటన్ (యోగిబాబు)కు చెఫ్ గా ఉద్యోగం రావడం, అతడు ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టుకొని ఆ ఇద్యోగం సంపాదించడం, ఆ ఉద్యోగం గనుక పోతే నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న తన స్నేహితురాలిని పెళ్లి చేసుకొను అనడంతో కాటన్ కి అసిస్టెంట్ గా లండన్ వెళుతుంది వైష్ణవి.
విచిత్రంగా లండన్ లో కాలుమోపినప్పట్నుంచి వైష్ణవి జీవితంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకొంటుంటాయి. కట్ చేస్తే.. అందరూ అనుకొంటున్నట్లుగా అలా వింతగా ప్రవర్తిస్తున్నది వైష్ణవి కాదని, ఆమె దేహంలోకి ఆత్మగా ప్రవేశించిన “మోహిని” అని తెలుస్తుంది. ఇంతకీ మోహిని ఎవరు? వైష్ణవి శరీరంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది? ఆమె లక్ష్యం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రమే “మోహిని”.
నటీనటుల పనితీరు : వజ్రాన్ని సానబట్టే కొద్దీ మెరుస్తుంది అన్నట్లుగా.. వయసు పెరిగే కొద్దీ త్రిష మరింత గ్లామరస్ గా తయారవుతోంది. ఆల్మోస్ట్ అందరు హీరోలతో జత కట్టేసింది అని వదిలేశారు కానీ.. ఇప్పటికీ ప్రేక్షకులను తన అందంతో-అభినయంతో ఆకట్టుకోగల సత్తా తనకు పూర్తి స్థాయిలో ఉందని త్రిష మరోమారు ప్రూవ్ చేసుకొంది. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన షేడ్స్ ను అత్యంత సునాయాసంగా పోషించి తన సీనియారిటీని ప్రూవ్ చేసుకొంది.
బాలీవుడ్ నటుడు జాకీ ఈ చిత్రంలో సౌత్ కి పరిచయమవ్వడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. చూడ్డానికి బాగానే ఉన్నా.. పెర్ఫార్మెన్స్ విషయంలో ఆకట్టుక్కోలేకపోయాడు. యోగిబాబు తనదైన స్టైల్లో కాస్తంత నవ్వించగా, మధుమిత నటన కోవై సరళను తలపిస్తుంది. ముఖేష్ తివారీది విలన్ పాత్ర అనే విషయం మనకి ఆయన ఓ పదిసార్లు అరిస్తే తప్ప తెలియదు.
సాంకేతికవర్గం పనితీరు : వివేక్-మార్విన్ సమకూర్చిన బాణీలు బాగోకపోగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమాత్రం కొత్తగా లేదు. సినిమాటోగ్రఫీది కూడా అదే పద్ధతి. ఈయన కెమెరా యాంగిల్స్ కంటే మన విఠలాచార్య గారివి చాలా బెటర్ అనిపిస్తాయి. అప్పట్లో టెక్నాలజీ అనేది అందుబాటులో లేనప్పుడే హారర్ సినిమాలను ఆకట్టుకొనే విధంగా రూపొందించారు. ఇప్పుడు ఇంట టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా కనిపించడం తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదు.
దర్శకుడు మాదేష్ ఇంకా “జగన్మోహిని” (1978) దగ్గరే ఆగిపోయినట్లున్నాడు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలైన్ తప్ప సినిమా మొత్తం ఆల్రెడీ టీవీలో ఒక పడిసార్లు చూసేసినట్లుగానే అనిపిస్తుంటుంది. అందులోనూ లారెన్స్ “కాంచన” సిరీస్ కోసం ఫాలో అవుతూ వస్తున్న కామెడీ ఫార్మెట్ ను మాదేష్ కూడా రిపీట్ చేయడానికి ప్రయత్నించడం పెద్ద మైనస్. సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా లేకపోవడం.. సినిమా మొత్తం హారర్ థ్రిల్లర్ లా కాకుండా.. ఏదో “సంసారం ఒక చదరంగం” సీరియల్ తరహాలో సాగడం బోర్ కొట్టించేస్తుంది.
విశ్లేషణ : ఏదో త్రిష మీద అభిమానంతో థియేటర్ కి వచ్చే అతి తక్కువ మంది జనాలు కూడా సినిమా ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేసేలా చేసిన సినిమా “మోహిని”. పస లేని కథ, ఆసక్తి లేని కథనం, అలరించని గ్రాఫిక్స్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు భరించడం బాగా కష్టం.