2023 Rewind: ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

  • January 4, 2024 / 09:12 AM IST

ఈ ఏడాది విడుదలైన రెండొందల పైచిలుకు సినిమాల్లో ఫ్లాపులే ఎక్కువ. అయితే.. అన్ని ఫ్లాప్ సినిమాల గురించి మనం ఎక్కువగా ఫీలవ్వం. ఈ సినిమా బాగుండొచ్చేమో అని అంచనా వేసుకొని థియేటర్ కి వెళ్ళి.. ఇలా ఉందేంట్రా బాబు అని తలపట్టుకొన్న సినిమాలు కొన్ని ఉంటాయి. 2023లో అలా ప్రేక్షకుల్ని తలపట్టుకొని థియేటర్ నుండి బయటకు పంపిన సినిమాలేమిటో చూద్దాం..!!

1. ఆదిపురుష్

రాముడి కథ, రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాక సినిమా లవర్స్ అందరూ ఫిక్స్ అయిన చిత్రం “ఆది పురుష్”. అయితే.. ఆ అంచనాలను ఆదిలోనే తుడిచిపెట్టేశాడు దర్శకుడు ఓం రౌత్. టీజర్ & ట్రైలర్ లో గ్రాఫిక్స్ చూసి షాక్ అవ్వని వారు లేరు. ఇక సినిమా పరిస్థితి కూడా అంతే. విడుదలైన కొన్ని రోజులపాటు ఇది రామాయణం కాదు అని బుకాయించడానికి దర్శకబృందం ప్రయత్నించినప్పటికీ.. ఆఖరికి పరాజయాన్ని ఒప్పుకోక తప్పలేదు.

OTT: Amazon Prime

2. మైఖేల్

ఇది కేజీఎఫ్ రేంజ్ సినిమా అని సందీప్ కిషన్ చేసిన హడావుడికి, ప్రమోషనల్ కంటెంట్ కట్ కూడా బాగుండడంతో అందరిలోనూ మంచి ఆసక్తి రేగింది. కట్ చేస్తే.. సినిమా విడుదలైన మొదటి ఆటకే అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. నత్తనడకలా సాగిన స్క్రీన్ ప్లే, లెక్కలేనన్ని స్లో మోషన్ షాట్స్ ఆడియన్స్ కు బోర్ కొట్టించాయి. సినిమా మొత్తానికి బాగుండేది సినిమాటోగ్రఫీ వర్క్ ఒక్కటే.

OTT: Aha

3. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

శ్రీనివాస్ అవసరాల సినిమాలంటే నాకు ప్రత్యేకమైన ఆసక్తి. ఆరోగ్యకరమైన హాస్యం, ద్వంద్వార్ధాలు లేని సంభాషణలు, చక్కని తెలుగు తొణికిసలాడేలా అవసరాల తెరకెక్కించే సినిమాలు కమర్షియల్ గా ఫెయిలైనా.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వడమే కాక.. ఆడియన్స్ ఓపికను కూడా టెస్ట్ చేసిన సినిమా “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి”. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఒక లవ్ స్టోరీలోని విభిన్నమైన కోణాలను పరిచయం చేయాలని అవసరాల చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

OTT: SunNxt

4. రావణాసుర

ధమాకా, వాల్తేరు వీరయ్య” లాంటి సూపర్ హిట్స్ తర్వాత రవితేజ నటించగా విడుదలైన చిత్రం “రావణాసుర”. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఓ బెంగాళీ చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ్ నెగిటివ్ రోల్ ప్రత్యేక ఆకర్షణగా విడుదలైన ఈ చిత్రం పేలవమైన స్క్రీన్ ప్లే & కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కారణంగా విఫలమైంది.

OTT: Netflix

5. శాకుంతలం

నిజానికి ఈ చిత్రం సమంత, గుణశేఖర్ లకు కమ్ బ్యాక్ ఫిలిమ్ గా నిలుస్తుంది అనుకున్నారందరూ. కానీ.. విడుదల వారంలోనే ఒటీటీలో ప్రత్యక్షమై సినిమా ఏ స్థాయిలో పరాజయం పాలైందో అందరికీ.. అర్ధమయ్యేలా చేసింది. సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క పాజిటివ్ పాయింట్ లేకపోగా.. సినిమా చేసిన కలరింగ్ & డి.ఐ దర్శకుడిగా గుణశేఖర్ పనితనాన్ని ప్రశ్నించేలా చేశాయి.

OTT: Amazon Prime

6. ఏజెంట్

అఖిల్ రీరీరీ లాంచ్ లలో భాగంగా విడుదలైన చిత్రం “ఏజెంట్”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు అనుకున్నారందరూ. కానీ.. బిగ్గెట్ డిజాస్టర్ గా నిలిచింది. అర్ధం పర్ధం లేని స్క్రీన్ ప్లే & సన్నివేశాలు సినిమాకి మెయిన్ మైనస్. ఇప్పటికీ ఈ సినిమా ఒటీటీ రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేకపోవడం కొసమెరుపు.

OTT: SonyLiv

7. కస్టడీ

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో “కస్టడీ”పై మంచి అంచనాలు ఉండేవి. నాగచైతన్యకృతిశెట్టిల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ విడుదలైనప్పటికీ.. కంటెంట్ లో బలం లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది.

OTT: Amazon Prime

8. స్పై

కార్తికేయ 2” లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత నిఖిల్ నటించిన సినిమా కావడం, ట్రైలర్ కూడా బాగుండడంతో “స్పై” మీద మంచి అంచనాలు ఉండేవి. కట్ చేస్తే.. సినిమా తెరకెక్కిన ప్రొడక్షన్ డిజైన్ & స్క్రీన్ ప్లే & కోర్ పాయింట్ వీక్ గా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. అయితే.. నిఖిల్ మాత్రం ఫెయిల్యూర్ తనకు ఎఫెక్ట్ అవ్వకుండా తీసుకున్న ముందు జాగ్రత్తలు ఫలించి అతడికి ఎలాంటి నెగిటివిటీ తీసుకురాలేదు.

OTT: Amazon Prime

9. బ్రో

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ సినిమా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే & మాటలు, తమన్ సంగీతం. ఒక హిట్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్న ఈ చిత్రం ఆఖరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత సినిమాల పాటలతో సినిమాను నింపేయడం పెద్ద మైనస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్ చూసి తిట్టుకోని ప్రేక్షకులు కూడా లేరు.

OTT: Netflix

10. భోళా శంకర్

అసలు పవన్ కళ్యాణ్ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ప్రారంభమైన కొన్ని రోజులకే ఆగిపోయి.. టాలీవుడ్ మొత్తం తిరిగి చిరంజీవి వద్దకు వచ్చిన “వేదాలమ్” రీమేక్ ను ఆయన అంగీకరించడమే పెద్ద మైనస్ అంటే.. ఏరికోరి మెహర్ రమేష్ కు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడం మరో మైనస్. సినిమా డిజాస్టర్ గా నిలవడం పక్కన పెడితే.. చిరంజీవి-శ్రీముఖి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉండడం అభిమానులకు మింగుడుపడలేదు.

OTT: Netflix

11. స్కంధ

బోయపాటి-రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలుండేవి. అయితే.. అనవసరంగా ఇరికించిన రామ్ డబుల్ రోల్, లాజిక్కా తొక్కా అనేట్లుగా సాగే వరుస పోరాట సన్నివేశాలు, ఎమోషన్ అనేది లేని స్క్రీన్ ప్లే కారణంగా బాక్సాఫీస్ వద్ద బేజారైపోయింది “స్కంధ”.

OTT: Disney+Hotstar

12. కీడా కోలా

“ఈ నగరానికి ఏమైంది?” తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో యూత్ ఆడియన్స్ లో భీభత్సమైన క్రేజ్ ఏర్పడిన చిత్రం “కీడా కోలా”. మేకింగ్ & కొన్ని కామెడీ సన్నివేశాల వరకూ పర్వాలేదు కానీ.. ఓవరాల్ గా మాత్రం ఆడియన్స్ ను అలరించలేకపోయిన చిత్రంగా మిగిలిపోయింది. తరుణ్ భాస్కర్ మళ్ళీ ఎప్పుడు హిట్ కొడతాడో చూడాలి.

OTT: Aha

13. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్

నితిన్ (Nithiin) కెరీర్లో నాసిరకం సినిమాలు చాలా ఉన్నాయి కానీ.. వాటన్నిటినీ బీట్ చేసిన చిత్రం “ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్”. మూలకథ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. కథనం, కుళ్ళు కామెడీని ప్రేక్షకులు భరించలేకపోయారు. ఏంది మైసమ్మా నీ స్క్రీన్ ప్లే అని తలపట్టుకొన్నారు.

OTT: Netflix

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus