ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయడం లేదు… థియేటర్ల యాజమాన్యం ఆందోళన

పగోళ్లకు కూడా ఈ కష్టం రాకూడదు అని అంటుంటారు మీకు తెలుసు కదా? ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది బాలీవుడ్‌కి. దేశంలో హిందీ సినిమా పరిశ్రమకు మించింది లేదు అంటూ అంతెత్తున ఎక్కి కూర్చున్న ఈ సినిమా పరిశ్రమ ఇప్పుడు సరైన విజయం కోసం ఆపసోపాలు పడుతోంది. అయినా ఈ మాట మేం అనడం లేదు. అక్కడి సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్‌ల ఓనర్లే, టీమే అంటున్నారు. అంతేకాదు సరైన సినిమాలు లేక, రాక థియేటర్లు మూసేస్తున్నారు కూడా.

ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ స్క్రీన్స్‌లో రోజూ సినిమాలు పడటం లేదు అంటే నమ్ముతారా? అవును సరైన సినిమాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు దీంతో మూసేయడానికి కూడా యజమానులు సిద్ధమవుతున్నారట. భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తున్నా, కావాల్సినంత కమర్షియల్‌ హంగులు జోడిస్తున్నా సినీప్రియుల్ని అవేవీ ఆకట్టుకోవడం లేదు అనేది బాలీవుడ్‌ వర్గాల మాట. ఇటీవల విడుదలైన అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) – టైగర్‌ ష్రాఫ్‌ ‘బడేమియా ఛోటేమియా’, అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ‘మైదాన్‌’ (Maidaan) సినిమాలు భారీగా ముస్తాబై వచ్చాయి.

అయితే బాక్సాఫీసు దగ్గర మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో ఆయా సినిమాలకు ఇచ్చిన కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో ప్రదర్శనలను క్యాన్సిల్‌ చేస్తున్నారట. సింగిల్‌ స్క్రీన్ల పరిస్థితి కూడా అలానే ఉంది అంటున్నారు. దీంతో థియేటర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారట. ముంబయికి చెందిన ఓ మల్టీప్లెక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియాతో చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి.

ఎన్నికలు, వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిలిపివేత నిర్ణయం తీసుకోలేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు సినిమాలు రావడం లేదు. దీంతో సినిమాలపై ఆసక్తి తగ్గిపోతుంది అందుకే మూసివేత పరిస్థితి వచ్చింది అని ఆయన అన్నారు. కరోనా తర్వాతి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు కాస్త ఓకే అని.. అయితే ఇంకా పూర్వపు వైభవం రాలేదు అని అంటున్నారు బాలీవుడ్‌ సినిమా జనాలు. చూద్దాం ఎప్పటికి వస్తుందో ఆ పరిస్థితి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus