నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. డిసెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ షేర్ చేసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం :
ప్ర) ‘సీతా రామం’ తర్వాత మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తారు అని తెలుగు ప్రేక్షకులు ఆశించారు..కానీ గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘హాయ్ నాన్న’ తో వస్తున్నారు.. కారణం?
మృణాల్ ఠాకూర్ : ‘సీతా రామం’ తర్వాత మరింత వైవిధ్యమైన పాత్ర కోసం వెయిట్ చేశాను. నా మనసుకు దగ్గరైన పాత్రలు, సినిమాలు చేయాలని అనుకున్నాను. ప్రేక్షకుల అంచనాలు కూడా నిలబెట్టుకోవాలి కదా. అందుకే టైం తీసుకున్నాను. ‘హాయ్ నాన్న’ లో నాది అందరినీ అలరించే పాత్రే..! విరాజ్, యష్ణ పాత్రలతో అందరూ ట్రావెల్ అవుతారు.
ప్ర) ‘హాయ్ నాన్న’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
మృణాల్ ఠాకూర్ : యష్ణ అనే న్యూ ఏజ్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. చాలా లేయర్స్ కూడా ఉంటాయి. ఈ కథ హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్ ని అద్భుతంగా ప్రజంట్ చేస్తోంది. హాయ్ నాన్న అద్భుతమైన కథ. ఒక్కమాటలో చెప్పాలంటే.. డివైన్. షూటింగ్ చేస్తున్నప్పుడు అదే భావనతో నటించాను.
ప్ర)రియల్ లైఫ్ లో మీ నాన్నగారితో గడిపిన క్షణాలు.. ‘హాయ్ నాన్న’ షూటింగ్లో ఉన్నప్పుడు గుర్తొచ్చాయా?
మృణాల్ ఠాకూర్ : మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నా బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ మా నాన్న. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం మా నాన్న. ఎన్ని సమస్యలు ఉన్నా హాయిగా నవ్వుతూ జీవితాన్ని గడపాలని ఆయన చెబుతూ ఉంటారు. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుందని, జీవితంలో ఓర్పుతో ఉండాలి అని ఆయన చెబుతుంటారు. నాన్న నా జీవితానికి మూలస్థంభంగా నేను భావిస్తూ ఉంటాను. ‘హాయ్ నాన్న’ కథకి కనెక్ట్ అవ్వడానికి మా నాన్నపై ఉన్న ప్రేమ కూడా ఓ కారణమని చెప్పొచ్చు.
ప్ర) నానితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
మృణాల్ ఠాకూర్ : నాని చాలా సపోర్టివ్. నటించేటప్పుడు చాలా విలువైన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఆయన వండర్ఫుల్ కో స్టార్. ఆయనతో నటిస్తుంటే పెర్ఫార్మెన్స్ మరింత బాగా ఎలివేట్ అవుతుంది. నాని గారితో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి.
ప్ర)హాయ్ నాన్న ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనుకుంటున్నారు?
మృణాల్ ఠాకూర్ : నాకైతే నమ్మకం ఉంది. నిజాయితీగా చేశాం. ఒక ఆర్టిస్ట్ గా ఎలాంటి సినిమా చేస్తున్నామో మన మనసుకు తెలుస్తుంది. కథని పాత్రలని బలంగా నమ్మి అంతే నిజాయితీతో చేసిన సినిమా ఇది. నేనే కాదు.. నాని గారు, శౌర్యువ్, మా డీవోపీ షాను, సంగీత దర్శకుడు హేషమ్ , కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్ గారు ఇలా టీం అంతా చాలా నిజాయితీ పని చేశాం. కాబట్టి మా ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుంది అని నేను నమ్ముతున్నాను.
ప్ర) శౌర్యువ్ నూతన దర్శకుడు.. అతనితో పని చేయడం ఎలా అనిపించింది?
మృణాల్ ఠాకూర్ : శౌర్యువ్ కొత్త దర్శకుడు అనే ఆలోచన నా మైండ్లోకి రాలేదు. తన విజన్, అప్రోచ్ చాలా క్లారిటీగా ఉన్నాయి. తన క్రియేట్ చేసిన మ్యాజిక్ డిసెంబర్ 7న ప్రేక్షకులు చూస్తారు. ‘హాయ్ నాన్న’ విజువల్ ఎమోషనల్ ట్రీట్. తన డైరెక్షన్లో మళ్ళీ నటించాలని ఉంది.
ప్ర) ‘హాయ్ నాన్న’ విషయంలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటి ?
మృణాల్ ఠాకూర్ : ఈ సినిమా కోసం పాట పాడటం కాస్త ఛాలెంజ్ గా అనిపించింది. ఇందులో ‘అమ్మాడి’ పాటలో పెర్ఫెక్ట్ గా లిప్ సింక్ చేయాలి. నేను ప్రొఫెషనల్ సింగర్ ని కాదు. ప్రతి పదాన్ని ట్యూన్ కి తగ్గట్టు లిప్ సింక్ చేయాలి. అది కూడా నాకు సవాల్ గా అనిపించింది.
ప్ర) బేబీ కియారా గురించి ?
మృణాల్ ఠాకూర్ : కియారా చాలా క్రమశిక్షణ కలిగిన పాప. చాలా క్యూట్. తనతో వర్క్ చేయడం అనేది మరిచిపోలేని అనుభూతి. ఇంత చిన్న వయసులో అంతలా అర్థం చేసుకుని నటించడం అంటే మాటలు కాదు. అందుకే ఆమె బాగా స్పెషల్. తారా పాత్రని అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.
ప్ర) హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ గురించి చెప్పండి ?
మృణాల్ ఠాకూర్ : ‘హాయ్ నాన్న’ సబ్జెక్ట్ కి మంచి మ్యూజిక్ చాలా అవసరం. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సమయమా, అమ్మాడి, గాజు బొమ్మ, ఓడియమ్మ .. ఇలా అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. బీజియం కూడా సినిమాకు ప్రాణం అని చెప్పాలి.
ప్ర)నిర్మాణ సంస్థ ‘వైర ఎంటర్‌టైన్‌మెంట్’ గురించి చెప్పండి?
మృణాల్ ఠాకూర్ : వైర ఎంటర్‌టైన్‌మెంట్ వండర్ఫుల్ ప్రొడక్షన్ హౌస్. మోహన్ గారు, విజయేందర్ రెడ్డి గారు ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. గోవా, ఊటీ. ముంబై, హైదరాబాద్ ఇలా చాలా అద్భుతమైన లోకేషన్స్ లో షూట్ చేశారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందించారు.
ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
మృణాల్ ఠాకూర్ : ప్రస్తుతానికి ‘ఫ్యామిలీ స్టార్’ లో (Mrunal Thakur) నటిస్తున్నాను. అలాగే హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. మంచి కథ రావడానికి సమయం పడుతుంది.లేట్ అయినా ఎదురుచూసి మంచి కథలే చేస్తాను.