టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఎంటర్‌టైన్‌మెంట్‌ను తన బలంగా మార్చుకుని, ప్రేక్షకుల నాడి పట్టడంలో ఆయనకు మంచి పట్టుంది. దర్శకుడిగా చేసిన ప్రతి ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడంతో అనిల్ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
ఇటీవల సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా విడుదలైన సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో, అనిల్ కెరీర్‌లో మరో విజయం నమోదైంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన తదుపరి మూవీ తన పదో సినిమా ఏ హీరోతో ఉండబోతోందన్న విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను తనకు బాగా కలిసొచ్చిన హీరో విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని టాక్.
అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపికే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఆమె ప్రీవియస్ సినిమాల ఫలితాలపై మిశ్రమ స్పందన రావడంతో, ఈ ఎంపికపై అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి తన మార్క్ స్టోరీతో ఆమెకు కొత్త బ్రేక్ ఇస్తారా? లేక ఇది రిస్క్‌గా మారుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఒక కీలక క్యామియో పాత్ర ఉండబోతుందన్న వార్తలు కూడా బాగా ట్రేండింగ్లో ఉండగా, ఆ పాత్రకు రానా దగ్గుబాటి కానీ,మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉందన్న టాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే, అనిల్ రావిపూడి నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడక తప్పదు. అప్పటివరకు ఈ సినిమా చుట్టూ చర్చలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.