Mrunal Thakur : టాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న ఈ అందాల నటి, తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో ఆమె చూపిన సహజమైన అభినయం, అమాయకమైన అందం ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఆ విజయం తర్వాత మృణాల్ క్రేజ్ వేగంగా పెరిగింది.
తరువాత నాని సరసన ‘హాయ్ నాన్న’లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, మృణాల్ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. అదే సమయంలో హిందీలోనూ పలు విభిన్న చిత్రాలతో తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, భాషలకు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మంచి కథ ఉంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి , ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమని చెప్పింది. తెలుగులో తనకు లభించిన గౌరవం, అభిమానమే తనకు పెద్ద బలం అని తెలిపింది.
ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న మృణాల్, తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’ అనే లవ్ అండ్ యాక్షన్ డ్రామాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాతో మరోసారి మృణాల్ మ్యాజిక్ ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.