సకల కళా భరిణి ‘తనికెళ్ల భరణి’

“మంచి అభిరుచి, మంచి హృదయం, మంచి భావం, మంచి భాష కలబోస్తే భరణి కనిపిస్తాడు”.. ప్రముఖ కార్టూనిస్ట్ తనికెళ్ల భరణి గురించి చెప్పిన మాటలివి. అవును ఇవన్నీ భరణిని చూడగానే మనకి తెలుస్తాయి. అతను దర్శకత్వం వహించిన “మిథునం” సినిమాలో అయితే కనిపిస్తాయి. వీధి నాటకాల ద్వారా కవిగా, నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన సినిమాల్లోనూ సత్తా చాటారు. స్క్రీన్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా నవ్విస్తూనే.. నటనతో మెప్పిస్తున్నారు. నేడు (జూలై 14) 62 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన గురించి ఫోకస్ ..

చిన్న కుటుంబం

తనికెళ్ల భరిణి సొంతూరు జగన్నాధపురం ( పశ్చిమ గోదావరి జిల్లా). ఆయన తండ్రి టి.వి.ఎస్.ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయినే (దుర్గాభవాని) భార్యగా చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు కన్నబాబు. కుమార్తె సౌందర్యలహరి.

నాటకాల రాయుడిగా ..

భరిణి డిగ్రీ చదివే రోజుల్లో మిత్రుడు రాళ్ళపల్లి రాసిన “ముగింపు లేని కథ” నాటకంలో నటించారు. అతని నటనకు చప్పట్లు కురియడంతో వాటికి బానిస అయిపోయారు. డబ్బుల కోసం కంటే అభినందనల కోసమే నాటకాలు వేసేవారు. ఆ తర్వాత గార్ధభాండం, గోగ్రహణం, జంబూ ద్వీపం, కొక్కొరొకో, చల్ చల్ గుర్రం వంటి నాటకాలు రాయడమే కాదు .. నటించి ఆకట్టుకున్నారు.

ఉత్తమ రచయితగా..

నాటకాల రచన ప్రతిభను మెచ్చి భరిణికి రామరాజు హనుమంతరావు ” కంచు కవచం ” అనే సినిమా రాసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత లేడీస్ టైలర్ చిత్రం తర్వాత రచయితగా బిజీ అయ్యారు. శివ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు.

శివ భక్తులు
తనికెళ్ల భరిణి శివునికి పెద్ద భక్తులు. సినిమాల్లో బిజీగా ఉన్నా లంకేశ్వరునిపై రెండు పుస్తకాలు రాశారు. భరణి శివునకు అర్పించిన 108 కవితా మారేడుదళాల అష్టోత్తరం “ఆటగదరా శివా”. శివ తత్వాలతో శబ్బాష్ రా శంకరా .. అనే మరొక పుస్తకాన్ని రచించారు. అంతేకాదు నాలోన శివుడు గలడు, నీలోనే శివుడు గలడు అనే కీర్తనను స్వర పరిచారు.

దర్శకుడిగా

రచయితగా, నటుడిగా ఆకట్టుకున్న తనికెళ్ల భరిణి మెగా ఫోన్ పట్టి “మిథునం” తెరకెక్కించారు. అందరితో శబ్బాష్ రా భరిణి అనిపించుకున్నారు. రెండు పాత్రలతో (బాలసుబ్రమణ్యం, లక్ష్మి) సినిమాను పూర్తి చేసి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.

ఇప్పటి వరకు చెప్పినవన్నీ తెర వెనుక తనికెళ్ల భరిణి సాధించిన విజయాలు. కానీ తెరపై ఎన్నో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి పేరుతెచ్చుకున్నారు. వాటిలో కొన్ని..

మనీ

1993 లో వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ “మనీ” సినిమాలో మాణిక్యం గా భలే నటించారు. ఖాన్ దాదాను మోసం చేసే పాత్రలో జీవించేశారు. ఈ సినిమా చిన్న చిత్రంగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచింది.

యమలీల

పాతాళ భైరవి సినిమాలో నందమూరి తారకరారవు పేరు తోటరాముడు. ఈ పేరుతో కామెడీ విలన్ గా తనికెళ్ల భరిణి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. యమలీల సినిమాతో ఆయన నటుడిగా డిసైడ్ అయ్యారు.

సముద్రంచేపల కృష్ణగా సముద్రం సినిమాలో తనికెళ్ల భరిణి చేసిన నటనకు తెలుగు సినీ ప్రేక్షకులు బయపడి పోయారు. ఇందులో సీరియస్ విలన్ గా అద్భుత నటన ప్రదర్శించారు. ఉత్తమ విలన్ గా ఈ చిత్రానికి భరిణి నంది అవార్డు అందుకున్నారు.

నువ్వు నేను

తనికెళ్ల భరిణి అన్ని రకాల పాత్రలు చక్కగా చేయగలరు అని నిరూపించిన సినిమా “నువ్వు నేను”. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రకు ప్రాణం పోశారు. ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు ను సొంతం చేసుకున్నారు.

అతడు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో తనికెళ్ల భరిణి కనిపించేది కొద్దీ క్షణాలే అయినా అతను చెప్పిన డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యారు. “వాడు మగాడ్రా బుజ్జి ” అంటూ తనదైన స్టయిల్లో డైలాగ్ చెప్పి గుర్తుండి పోయారు.

జులాయి, రేసుగుర్రం సినిమాల్లో హీరో తండ్రిగా, ఆగడు, కార్తికేయ చిత్రాల్లో హీరోయిన్ నాన్నగా హుందాగా నటించారు. అలాగే డి ఫర్ దోపిడీ, సూర్య వెర్సస్ సూర్య చిత్రాల్లో హాస్యాన్ని పండించారు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒకే రకం పాత్రలకు పరిమితం కాకుండా, విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నారు. తనికెళ్ల భరిణి మరిన్ని చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ.. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది ఫిల్మీ ఫోకస్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus