రాజమౌళి సినిమా పోస్టర్ బయటకి రాగానే, త్రివిక్రమ్ సినిమా ప్లాట్ తెలియగానే, తమన్ సంగీతమందించిన పాట రిలీజ్ కాగానే… ‘ఇది దేనికి కాపీ’ అంటూ వెతికేస్తుంటారు నెటిజన్లు. ఆ అవకాశం వాళ్లు ఇస్తున్నారో, మన వాళ్లు తీసుకుంటున్నారో కానీ ఇదైతే చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. వీటిపై రాజమౌళి, త్రివిక్రమ్ కూల్ స్పందించి వదిలేస్తుంటారు. తమన్ కూడా గతంలో ఇదే పని చేశారు. అయితే ఇప్పుడు విరుచుకుపడుతున్నాడు తమన్. ‘వాళ్లకి అంత దమ్ముంటే… వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్ చేసి చూపించమనండి’ అంటూ చిర్రున లేచాడు.
‘మీ పాటల విషయంలో కాపీ అంటూ కామెంట్స్ వినిపిస్తుంటాయి కదా’ అని ప్రముఖ దినపత్రిక తమన్‌ను ఇటీవల అడిగింది. దానికి తమన్ చాలా సుదీర్ఘమైన సమాధానం ఇచ్చాడు. ‘‘ఓ పాట విడుదల చేసేముందు మేం అందరం వింటాం. ఆడియో కంపెనీలు, లిరిక్ రైటర్లు, నాతో పనిచేసే వాళ్లకు తెలివి లేదంటారా? ఒకవేళ నిజంగా నేను కాపీ కొట్టినా దర్శక నిర్మాతలకి నా ముఖం ఎలా చూపిస్తా? ‘నువ్వేలా కాపీ కొట్టావ్?’ అని అడుగుతారు కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు తమన్.
‘‘పనిలేక కొంతమంది చేసే విమర్శల్ని సీరియస్‌గా తీసుకొని ఉంటే ఈపాటిని నేనెక్కడో ఆగిపోయి ఉండేవాణ్ని. ‘బిజినెస్‌మెన్’లో ‘పిల్లా చావ్…’ పాటతో నాకొచ్చినంత చెడ్డ పేరు ఇంకెవరికీ వచ్చుండదు. ఆ విమర్శల్ని పట్టించుకొని ఉంటే నేను అక్కడే ఆగిపోవాలి. దాని తర్వాత నేను వంద చిత్రాలుపైగా చేశాను. ఇండస్ట్రీ నన్నెంతో నమ్మబట్టే ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాను. ఇవన్నీ చూశాకైనా నాపై చేస్తున్న విమర్శలకి సమాధానం దొరికి ఉండాలి’’ అన్నాడు తమన్.
‘‘అల..వైకుంఠపురములో..’తో నాకు పెద్ద పేరొచ్చేసింది. దాంతో వీణ్ని ఎలా అయినా టార్గెట్ చెయ్యాలి. కిందకు దింపేయాలి? అని కొంతమంది అనుకుంటున్నారు. వాళ్లకి సమాధానం చెప్పాలంటే రెండు నిమిషాల పని. నిజంగా నేను కాపీ చేస్తే ఆ పాటకు సంబంధించిన వాళ్లు ఈపాటికే కేసు వేసేవారు కదా. పోనీ కాపీ అని ముద్ర వేసిన వాళ్లకి దమ్ముంటే.. వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్ చేసి చూపించమనండి’’ అంటూ విరుచుకుపడ్డాడు తమన్.