సినిమాల్లో చూసి బయట జనాలు క్రైమ్‌లు చేస్తుంటారని కొంతమంది అంటుంటారు. అయితే అంత పక్కాగా స్క్రిప్ట్ ఉండకపోవడంతో ప్లాఫ్ అయిపోతుంటారు. ఇలా చేసేవారిలో సినిమా వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఎంత బాగా అనుకున్నా, ఎన్ని ప్లాన్స్ వేసినా పోలీసుల ఇన్వెస్టిగేషన్, ట్రీట్‌మెంట్ ముందు పనికిరారు. అంతేకాదు అడ్డంగా దొరికిపోయి అసలు విషయం ఒప్పుకొని, జైలుపాలు అవ్వాల్సి వస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌లో ఇదే జరిగింది. భార్యను చంపేసి, ఏమీ తెలియనట్లు నాటకాలాడిన భర్త పట్టుబడ్డాడు.
బంగ్లాదేశ్‌లో గత కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న విషయం నటి రైమా ఇస్లాం షిము మిస్సింగ్ కేసు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన రైమా ఇస్లాం షిము తాజాగా విగతజీవిగా ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. వివరాలేంటా అని ఆరాతీస్తే అసలు విషయం బయటికొచ్చింది. అది మిస్సింగ్ కాదని, భర్త చేసిన హత్యే అని పోలీసులు తేల్చేశారు. ఇంతకీ ఏమైందంటే…కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము కనిపించకుండా పోయింది.
తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త షెకావత్ అలీ నోబెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో జనవరి 16న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ విషయంలో విచారణ ప్రారంభించారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కెరానిగంజ్‌లో బ్రిడ్జి దగ్గర గన్నీ బ్యాగ్ కనిపించింది. ఆ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వెళ్లి ఆ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ఉన్నది నటి రైమా మృతదేహంగా గుర్తించారు.
ఈ క్రమంలో ఆమె శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఈ హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు షెకావత్ అలీ అంగీకరించాడు. అయితే ఈ హత్య వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది. తనే చంపేసి, సినిమా తరహాలో గన్నీ బ్యాగులో కట్టేసి దూరంగా పడేసి, నాటకం ఆడాడు షెకావత్. కానీ అడ్డంగా దొరికిపోయాడు. రైమా 1998లో ‘బర్తమాన్’ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించింది. సుమారు 25 చిత్రాల్లో నటించిన రైమా టీవీ షోలు, సీరియల్స్‌లో నటించింది. అలాగే కొన్ని సీరియల్స్ నిర్మించింది కూడా.