ఇవాళ హైదరాబాద్ లో జరిగిన “సైమా అవార్డ్స్” ప్రెస్ మీట్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు ఎన్నడూ లేని విధంగా 7 నేషనల్ అవార్డ్స్ వస్తే కనీసం ఇండస్ట్రీలో ఎవరూ స్పందించలేదు. కనీసం అవార్డ్ విజేతలను సత్కరించేందుకు ముందుకు రాలేదు. తెలుగు చిత్రసీమ ముందుకు రాకముందే సైమా సంస్థ అవార్డులు అందించడం అనేది హర్షణీయం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే, అందుకే ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేదు అంటూ అల్లు అరవింద్ చేసిన స్టేట్మెంట్స్ వైరల్ అయ్యాయి.
అయితే.. ఇప్పుడు నేషనల్ అవార్డుల విషయంలోనే కాదు, గతంలోనూ తెలుగు చిత్రసీమ చాలా విషయాల్లో స్తబ్తత చాటుకొంది. దేశం గర్వించదగిన తెలుగు గాయకుడు/నిర్మాత/సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణిస్తే ఇప్పటివరకు కనీసం ఆయన జ్ఞాపకార్థం ఒక్కటంటే ఒక్క సభ నిర్వహించలేకపోయిన దౌర్భాగ్యం తెలుగు ఇండస్ట్రీది. ఇంకా చెప్పాలంటే తమిళ చిత్రసీమ బాలు మరణానికి బాధపడి సభలు నిర్వహించింది.
బాలు సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే, తెలుగు ఇండస్ట్రీ స్పందించని విషయాలు కోకొల్లలు.
ఒక్క కూటమి గెలుపు ఉత్సవాలు తప్ప ఏ ఒక్క విషయాన్ని తెలుగు చిత్రసీమ కలిసి సెలబ్రేట్ చేసుకోలేదు, స్పందించలేదు. అల్లు అరవింద్ అన్నట్లు ఎవరి కుంపటి వారిదే. అయితే.. అలా వేరై ఎవరికి వారు పెట్టుకున్న కుంపట్లు భవిష్యత్తులో వారి గుడారాలనే తగలబెట్టేస్తాయి అనే విషయాన్ని కూడా వాళ్లు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏదో కలిసిపోయి, కలిసిమెలిసి పని చేయమని చెప్పడం లేదు కానీ.. ఒక కష్టం వచ్చినప్పుడో, ఒక సంతోషం వచ్చినప్పుడు కలిసి స్పందించండి, కలిసి సెలబ్రేట్ చేసుకోండి. లేకపోతే.. ప్రీరిలీజ్ ఈవెంటుల్లో ఒకరి గొప్పలు ఒకరు డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప ఇండస్ట్రీ పెద్దలు కానీ, ఇండస్ట్రీలో కీలక సభ్యులు కానీ ఎందుకు అక్కరకు రారు అని అందరికీ అర్థమై లేనిపోని సమస్యలకు దారి తీస్తుంది.