‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఆఖరులో ఈ సినిమాకు సీక్వెల్ ఉంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేశారు. మొదటి పార్టు ఇచ్చిన హైప్‌ని చూసిన ఫ్యాన్స్ రెండో పార్టు వీలైనంత వేగంగా వచ్చేస్తే బాగుండు అని అనుకున్నారు. సినిమా టీమ్ మాటలు విన్నప్పుడు సినిమా అలా వేగంగా వచ్చేలానే కనిపించింది. కానీ ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న పనులు చూస్తుంటే ఇప్పట్లో ‘కల్కి 2’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన కొత్త సినిమా ఓకే చేసుకునే పనిలో పడ్డారు. అవును మీరు చదివింది నిజమే.
నాగ్ అశ్విన్ ఇటీవల చెన్నై వెళ్లి వచ్చారని సమాచారం. ‘కల్కి 2’లో కీలక పాత్రలో నటించనున్న కమల్ హాసన్‌కు ఆ సినిమా కథ చెప్పడానికి కాదు.. రజనీకాంత్‌ను కలవడానికట. ఇటీవల రజనీకాంత్‌కు నాగ్ అశ్విన్ ఒక సినిమా కథ లైన్ చెప్పారట. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అనే చర్చ టాలీవుడ్ – కోలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది. ఏవిఎం సంస్థతో కలసి సినిమా చేస్తామని గతంలోనే నాగ్ అశ్విన్ ప్రకటించారు. అది రజనీ సినిమానే అని అంటున్నారు ఇప్పుడు.
అన్నట్లు ఆ మద్య ఒకసారి ముంబయి వెళ్లి అలియా భట్‌ని కలిశారు నాగ్ అశ్విన్. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేద్దామని ఆయన చూస్తున్నారు అని అప్పటి పుకార్ల సారాంశం. అయితే ఈ విషయంలో ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇప్పుడు రజనీ సినిమా చర్చల్లోకి వచ్చింది. మరి ఇదైనా నిజమవుతుందో లేదో చూడాలి. ఇదంతా ఓకే కానీ ‘కల్కి 2’ సినిమా ఎందుకు లేటు అనేదేగా మీ ప్రశ్న. ప్రస్తుతం ప్రభాస్ డేట్స్ పరిస్థితి చూస్తే ఇప్పుడు ‘కల్కి 2’ సినిమాకు స్థానం లేదు.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) పూర్తయ్యాక కొత్త సినిమాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. అప్పుడు ‘సలార్ 2’, ‘కల్కి 2’ ఉండొచ్చు.