వారసులుగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వారికి వుండే టెన్షన్లు అన్నీ ఇన్నీ కాదు. ముందుతరం వారి ఖ్యాతిని నిలబెడుతూనే తమకు తాము కొత్త బాటను నిర్మించుకోవాలి. అంతో ఇంతో తమకంటూ కొంత పేరు వస్తేగానీ తొలినాళ్లలో ప్రయోగాల జోలికి వెళ్లనేకూడదు. ఇలాంటి సవాలక్ష సమస్యలతో సావాసం చేసే స్టార్ వారసులకు కొన్నిసార్లు మీడియా వారు అడిగే యక్షప్రశ్నలు అదనం. ముఖ్యంగా ఓ ప్రశ్న అయితే అందరికీ కామన్. నట వారసత్వం అందుకున్న హీరో ఎప్పుడు పాత్రికేయులతో సమావేశమైనా వారికి ఎదురయ్యే ఏకైక ప్రశ్న “మీ తాత/తండ్రి గారు నటించిన ఫలానా సినిమాని మీరు రీమేక్ చేస్తున్నారా..?”.
ఈ ప్రశ్న అడగటం చాలా సులభం. కానీ సినిమా చేయడం.. అదీ ముందు తరంవారిని మరిపించేలా మెప్పించడం శీతాకాలంలో దుప్పటి లేకుండా పడుకోవడమంత కష్టం. జూనియర్ ఎన్టీఆర్ కి ‘గుండమ్మ కథ’, రామ్ చరణ్ కి ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’, నాగ చైతన్యకి ‘హలో బ్రదర్’ సినిమాలకి సంబంధించి తరచూ పాత్రికేయులు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. వారేమో అది అంత సామాన్యమైన విషయం కాదంటూ దాటవేస్తుంటారు. నిన్నటికి నిన్న నాగచైతన్యకి మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురవగా “అప్పట్లో అనుకున్నాం కానీ ఆ సినిమా రీమేక్ చేయకపోవడమే నయం అని చెప్పుకొచ్చాడు. పైగా తాను ఆ స్థాయిలో నటించలేనని” ఏళ్లుగా ఎదురవుతున్న ప్రశ్నకు ముగింపు పలికినట్టు బదులిచ్చాడు. ఇకనైనా మన మీడియా వారు ఆ ప్రశ్నను అడగకుండా ఉంటారేమో చూడాలి.
ఇక తర్వాతి సినిమాల గురించి మాట్లాడిన చైతూ “కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న సినిమా నేడు (బుధవారం) మొదలవనుందని, అలాగే నాని ‘జెంటిల్ మన్’ చిత్రానికి కథ అందించిన డేవిడ్ నాథన్ కథతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఓ సినిమా చేయాల్సి ఉందని చెప్పాడు.