టాలీవుడ్ హీరోల్లో నాగ చైతన్య (Naga Chaitanya) అంటే ప్రశాంతంగా ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎవరితోనూ గొడవలు లేకుండా, ఎవరి గురించి నెగిటివ్‌గా మాట్లాడకుండా తన పని తాను చూసుకునే చైతు, కెరీర్ పరంగా కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే తాజాగా ‘తండేల్’ (Thandel) ప్రమోషన్లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య, టాలీవుడ్‌లో నెగిటివ్ పీఆర్ ట్రెండ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్‌లో కొన్ని సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తూ, నెగిటివ్ ప్రచారం నడిపించే మోసపూరిత వ్యవస్థ ఉన్నట్టుగా తాను గమనించానని చైతన్య చెప్పాడు.
కొన్ని పీఆర్ టీమ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రత్యేకంగా ఇతర హీరోల సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయడానికే పనిచేస్తున్నాయని, దానివల్ల అసలు ప్రయోజనం ఏమిటో తనకు అర్థం కావడం లేదని చైతన్య వ్యాఖ్యానించాడు. అయితే ఏ హీరోలు దీనికి పాల్పడుతున్నారు? ఏ పీఆర్ సంస్థలు ఈ పని చేస్తున్నాయి? అనే విషయాన్ని మాత్రం చైతన్య వెల్లడించలేదు.
అంతేకాదు, ఒక సినిమా విజయవంతం కావడం లేదా ఫ్లాప్ అవడం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందే కానీ, సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎవరికీ ఉపయోగపడవని చైతన్య స్పష్టం చేశాడు. ‘‘వేరే హీరోల సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేసేందుకు డబ్బులు పెట్టే బదులు, అదే డబ్బును తమ సినిమాల ప్రమోషన్‌కు లేదా వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు.
నెగిటివ్ ప్రచారంతో ఎవరికీ లాభం లేదు’’ అని చైతన్య అన్నాడు. ఈ రోజుల్లో సినిమా విడుదలకు పబ్లిసిటీ తప్పనిసరని, కానీ దాన్ని ఉపయోగించుకునే విధానం చాలా ముఖ్యమని నాగ చైతన్య అభిప్రాయపడ్డాడు. ‘‘పాజిటివ్ ప్రమోషన్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. కానీ నెగిటివ్ పీఆర్ చేసేవాళ్లు అదే డబ్బును మరొక మంచి పనికి ఉపయోగించుకుంటే మంచిది’’ అని సూచించాడు.