అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈయన తెలుగులో థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా తనని బాగా నిరాశపరిచిందని చెప్పాలి. ఈ సినిమా అనంతరం ఈయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసిన లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఈయన మొదటిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తనకు థియేటర్ అంటే సెంటిమెంట్ అని అందుకే తాను థియేటర్లో సినిమాలు చూడటానికి ఇష్టపడనట్టు చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి నాగచైతన్య లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఓపెన్ అయ్యారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తాను హీరోగా మొదటిసారి నటించిన జోష్ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం తాను కూడా థియేటర్ కి వెళ్లి సినిమా చూశానని తెలిపారు.ఇక ఫస్ట్ హఫ్ మొత్తం ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమా చూశారు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక్కొక్కరు సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవడం తనని చాలా బాధ పెట్టిందని నాగచైతన్య వెల్లడించారు.
ఇలా సినిమా నచ్చక ఒక్కొక్కరు థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోవడం వల్ల తనకు చాలా బాధ కలిగిందని ఇప్పటికే ఆ సంఘటనలు తన మైండ్లో మెదులుతూనే ఉంటాయని నాగచైతన్య వెల్లడించారు. అందుకే ఆ రోజు నుంచి తాను థియేటర్ కి వెళ్లి సినిమాకు చూడకూడదని నిర్ణయించుకున్నానని, ఆ భయం వల్లే ఇప్పటివరకు తాను థియేటర్లో సినిమా చూడలేదని నాగచైతన్య పేర్కొన్నారు.మొత్తానికి జోష్ సినిమా గురించి ఈయన వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.