క్రేజీ కాంబినేషన్ లో చైతూ మూవీ!

నాగచైతన్య ఏ ముహూర్తాన “సాహసం శ్వాసగా సాగిపో” సినిమా మొదలెట్టాడో గానీ విడుదలలో జాప్యం “ఆటోనగర్ సూర్య” సినిమాని గుర్తు చేస్తోంది. ఇక “ప్రేమమ్” దసరా విడుదలకు ముస్తాబవుతోంది. వీటి తర్వాత చైతూ పెళ్ళికొడుకుగా ముస్తాబవుతాడనుకుంటే ఈ ఏడాది పెళ్లిళ్లు ఉండబోవని నాగ్ సెలవిచ్చారు. దీంతో చైతూ తర్వాతి సినిమాకి రంగం సిద్ధమైంది.

‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ, చైతూ హీరోగా ఓ సినిమా చేయాలని చాలా కాలంగా అక్కినేని వారి కాంపౌండ్ లోనే ఉండిపోయాడు. ఆ సినిమా ఈ నవంబర్ లో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాతో చైతూకి జోడీగా నటించనుంది రకుల్ ప్రీత్ సింగ్. అక్కినేని హీరోలతో ఆడిపాడటం ఆమెకిదే ప్రథమం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారట. ఇలా ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, టెక్నీషియన్లతో తనయుడి సినిమాకి క్రేజ్ తీసుకొచ్చారు నాగ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus