కథానాయకుడిగా ఇప్పటివరకూ దక్కిన విజయాలు తక్కువే అయినప్పటికీ.. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న హీరో అక్కినేని నాగచైతన్య. “యుద్ధం శరణం” అనంతరం ఏడాది విరామంతో వస్తున్న ఈ సినిమాపై నాగచైతన్య మాత్రమే కాదు అక్కినేని అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకొన్నారు. మారుతి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ట్రైలర్ జనాల్ని ఆకట్టుకొని ఉండడంతో రేపు విడుదలవుతున్న ఈ చిత్రంపై చైతూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వినాయక చవితి సందర్భంగా రేపు విడుదలవుతున్న “శైలజా రెడ్డి” అల్లుడు గురించి నాగచైతన్య చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..!!
మా ఆవిడ నాకు ఇంకా సినిమా చూపించలేదు..రేపు “శైలజా రెడ్డి అల్లుడు” సినిమా విడుదలవుతున్న టెన్షన్ కంటే నా వైఫ్ సమంత తన “యు టర్న్” సినిమా ఇంకా చూపించలేదన్న బాధే ఎక్కువగా ఉంది (నవ్వుతూ..). నేను ఒరిజినల్ వెర్షన్ చూశాను కానీ తెలుగు వెర్షన్ థియేటర్ లోనే చూస్తాను. కానీ.. రెండు సినిమాలు మంచి హిట్ అయ్యి ఇద్దరికీ విజయం దక్కాలనే కోరిక మాత్రం బలంగా ఉంది.
మారుతి మార్క్ క్యారెక్టరైజేషన్ హైలైట్..నేను ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు శైలజారెడ్డి అల్లుడులో పోషించే పాత్రకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను నా పర్సనల్ లైఫ్ లో ఎంత సరదాగా ఉంటానో ఈ సినిమాలోనూ అంతే హుందాగా ఉంటాను. అందుకే క్యారెక్టర్ నేమ్ కూడా “చైతన్య” అనే పెట్టారు మారుతి. అయితే.. మారుతి హీరోల్లా నాకు ప్రత్యేకమైన రోగాలేమీ ఉండవు. చాలా హిలేరియస్ గా ఉంటుంది.
నాకు ఎలివేషన్ కంటే కంటెంట్ ముఖ్యం..ఈ సినిమాకి “శైలజా రెడ్డి అల్లుడు” అనే టైటిల్ పెట్టడం పట్ల నేను చిన్నబుచ్చుకున్నానేమోనని చాలామంది అనుకొన్నారు. కానీ.. నాకు అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. నాకు ఎప్పుడైనా సరే కంటెంట్ ఇంపార్టెంట్. సినిమాలోని కంటెంట్ కు “శైలజారెడ్డి అల్లుడు” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని భావించాను. అందుకే టైటిల్ అనుకోగానే ఒకే చెప్పేశాను.
రొటీన్ అత్త-అల్లుడు సినిమా కాదు..టైటిల్ చూసి ఇది రెగ్యులర్ అత్త-అల్లుడు నడుమ జరిగే గొడవలతో సాగే సినిమా అనుకొంటున్నారు. కానీ.. ఈ సినిమాలో అల్లుడు ఒక్కసారి కూడా అత్తతో గొడవపడదు. సినిమా మొత్తం “ఈగో” అనే అంశం చుట్టూ తిరుగుతుంటుంది.
రమ్యకృష్ణగారితో నటించడానికి మొదట్లో భయపడ్డాను కానీ..రమ్యకృష్ణగారు నాన్నగారితో కలిసి నటించిన “హలో బ్రదర్” ఒక 30, 40 సార్లు చూసి ఉంటాను. అలాంటిది ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మొదట్లో భయపడ్డాను. కానీ.. ఆమె చాలా స్వీట్ పర్సన్. నన్ను కంఫర్ట్ జోన్ లోకి తీసుకురావడంతోపాటు మంచి సరదాగా ఉండేవారు. ఆవిడ నా కెరీర్ లో ది బెస్ట్ కోస్టార్.
ఆ 30 నిమిషాలే కీలకం..నా దృష్టిలో సినిమా ఎలా ఉన్నా కూడా చివరి 30 నిమిషాల్లో ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా సినిమాలో ఇన్వాల్వ్ చేయగలిగితే సినిమా సూపర్ హిట్ కిందే లెక్క. “శైలజా రెడ్డి అల్లుడు”లో ఆ అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.
ఈ గ్యాప్ మాత్రం అనుకోకుండా వస్తుంది..“ఆటోనగర్ సూర్య” రిలీజ్ కి ముందు కూడా ఏడాది గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కూడా “యుద్ధం శరణం” రిలీజై సంవత్సరం పూర్తయిన తర్వాత “శైలజా రెడ్డి అల్లుడు” రిలీజవుతుంది. ఈ గ్యాప్ నేను సరిగా ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల వచ్చింది కాదు. నిజానికి.. “సవ్యసాచి” రెండు నెలల క్రితమే విడుదలవ్వాలి కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా నవంబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇకనుంచి ఈ తరహా మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకొంటాను.
సినిమా రిలీజ్ డేట్స్ ఛేంజ్ చేయడం సరికాదు..“శైలజా రెడ్డి” అల్లుడు పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం వల్ల రిలీజ్ డేట్ ఛేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంతకుమునుపు కూడా నా సినిమాలు కొన్ని అనుకున్న డేట్ కి రిలీజ్ అవ్వలేదు. ఇలా ఆఖరి నిమిషంలో రిలీజ్ డేట్స్ ఛేంజ్ చేయడం వల్ల అభిమానులు డిజప్పాయింట్ అవుతారు. అలాగే.. మా రిలీజ్ డేట్స్ బట్టి ప్లాన్ చేసుకొన్న వేరే సినిమాలు కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను.
త్వరలోనే మారుతి-అఖిల్ కాంబినేషన్ సినిమా..“శైలజా రెడ్డి అల్లుడు” షూటింగ్ టైమ్ లోనే మారుతి & అఖిల్ మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. మారుతి ఆల్రెడీ అఖిల్ కి ఒక కాన్సెప్ట్ చెప్పాడట. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే తప్పకుండా ఉంటుంది. అయితే.. ఆ సినిమా ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేను.
ఆర్ ఎక్స్ 100 లాంటి కథలకు నేను రెడీగా లేను..“అర్జున్ రెడ్డి” సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన “ఆర్ ఎక్స్ 100” కూడా బాగుంది. కానీ.. ఆ తరహా పాత్రలు నేను చేయలేనేమోనని నా భావన. ఒకవేళ చేయాలన్నా నాకు చాలా టైమ్ కావాలి. అందుకు కారణం నేను ఆ తరహా పాత్రలు చేయడానికి రెడీగా లేను.
విజయ్ దేవరకొండ మాత్రమే కాదు అందరూ కాంపిటీషనే..“గీత గోవిందం” హిట్ అయ్యింది కాబట్టి నాకు విజయ్ దేవరకొండ కాంపిటీషన్ అని నేను అనుకోను. నావరకూ ప్రతి నటుడు నాకు కాంపిటీషనే. అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను. అయితే.. వాళ్ళతో పోటీ పడి హిట్ కొట్టాలి అని మాత్రం అనుకోను. నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకోవాలి అనేదే నా ధ్యేయం.
శివ నిర్వాణ సినిమా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ..అక్టోబర్ నుంచి శివ నిర్వాణ దర్శకత్వంలో నేను-సమంత జంటగా నటించనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా మేము రీల్ లైఫ్ భార్యాభర్తలుగా కనిపిస్తాము. భార్యాభర్తల నడుమ సాగే స్వచ్చమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
సోగ్గాడే చిన్ని నాయన ఫ్రాంచైజ్ చేయాలని ఉంది..“సోగ్గాడే చిన్ని నాయన” సినిమా రిజల్ట్ తర్వాత బంగార్రాజు పాత్రతోనే ఒక సినిమా చేయాలనుకొన్నాము కానీ.. ఇంకా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉందా సినిమా. కానీ నాకు మాత్రం ఆ సినిమాకి ఒక ఫ్రాంచైజ్ లా రెండేళ్లకొక సినిమా చేయాలని ఉంది. ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
కొత్తగా ప్రయత్నించాను కానీ వర్కవుట్ అవ్వలేదుగా..కొత్త తరహా సినిమాలు చేయాలని నాకు కూడా ఉంటుంది. కానీ.. నావరకూ నాకు కొత్త దర్శకులతో చేసిన సినిమాలేవీ అచ్చిరాలేదు. “దడ, బెజవాడ” నా కెరీర్ లో బిట్టర్ ఎక్స్ పీరియన్స్ లు. అందుకే ప్రయోగాలు, కొత్త దర్శకుల జోలికి ఇప్పుడప్పుడే వెళ్ళాలనుకోవడం లేదు. హీరోగా ఒక రెండు మూడు హిట్లు కొట్టాక అప్పుడు మళ్ళీ ఒక ప్రయోగమో లేదా ఒక కొత్త దర్శకుడితో చిత్రమో ఆలోచిస్తాను.
కొత్త కథలు నా వరకూ రావడం లేదు..బేసిగ్గా మేం అందరం ఒక ప్రొటెక్టడ్ జోన్ లో ఉంటాం. అందువల్ల కొత్త దర్శకులు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. నా ఫ్రెండ్స్, మేనేజర్స్ & ఇండస్ట్రీకి రిలేటాడ్ పర్సన్స్ కి చెబుతూనే ఉంటాను. ఎవరైనా మంచి కథ లేదా పాయింట్ తో వస్తే నా దగ్గరికి తీసుకురండి అని.