అక్కినేని థర్డ్ జనరేషన్ హీరోలైన అఖిల్, నాగచైతన్య లు ప్రస్తుతం వరుస ప్లాపులతో ఉన్నారు. మొన్నటి వరకూ తండ్రి నాగార్జున కాస్త స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నడిపించేవాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరికీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడట. దీంతో వీరిద్దరూ హిట్లు కొట్టలేక సతమతమవుతున్నారు. ఒకరి స్క్రిప్టుల విషయంలో ఒకరు చర్చించుకుంటున్నారని సమాచారం. అయితే అన్నయ్య చైతూకి తమ్మడు అఖిల్ కొన్ని టిప్స్ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్యే చెప్పాడు. అదేంటి అఖిల్ కంటే చైతూ పెద్దోడు కదా.. అందులోనూ చైతూకైనా చెప్పుకోవడానికి కొన్ని హిట్లున్నాయి.. కానీ అఖిల్ కు అసలు హిట్టే లేదు. మరి అఖిల్ చైతూకి సలహాలివ్వడమేంటి..? అనేగా మీ డౌట్…?
అదేమీ లేదండీ… చైతూ హీరోగా నటించిన ‘మజిలీ’ చిత్రంలో నాగచైతన్య ఓ క్రికెటర్‌గా నటించాడు. అయితే .. చైతూకి క్రికెట్ పై పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ నేర్చుకోవాల్సివచ్చింది. ఇందుకోసం కొంతమంది రంజీ ప్లేయర్స్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడట చైతూ. దాంతో పాటూ తమ్ముడు అఖిల్ సలహాలూ సూచనలు కూడా తీసుకున్నాడట. ఈ విషయం పై చైతూ మాట్లాడుతూ ”నాకు క్రికెట్ అస్సలు రాదు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను. ఆ తరవాత మళ్ళీ బ్యాట్ పట్టుకోలేదు. అఖిల్ మాత్రం ఎప్పుడు చూసినా క్రికెట్ ధ్యాసలోనే ఉండేవాడు. అందుకే అఖిల్ దగ్గర టిప్స్ తీసుకున్నాను. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ లైఫ్ స్టైల్ ఏమిటో, గ్రౌండ్‌లో ఎలా ఉంటాడో అఖిల్ చెప్పాడు. అవన్నీ పాటించాను..” అంటూ చైతూ తెలిపాడు. ఇక ‘మజిలీ’ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.